Delhi: ఒమిక్రాన్‌ బాధితులకు ఏం చికిత్సఅందిస్తున్నారంటే..?

ఒమిక్రాన్‌ బాధితులకు కేవలం మల్టీ విటమిన్‌లతో పాటు పారాసెటమాల్‌ మాత్రలను మాత్రమే అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Published : 24 Dec 2021 14:21 IST

దిల్లీ వైద్యుల వెల్లడి

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించడంతో పాటు పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వెంటనే ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ బాధితులకు కేవలం మల్టీ విటమిన్‌లతో పాటు పారాసెటమాల్‌ మాత్రలను మాత్రమే అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన 40 మంది బాధితులు చేరగా ఇప్పటికే 19 మంది డిశ్ఛార్జి అయినట్లు తెలిపారు. దిల్లీలో మొత్తంగా ఇప్పటివరకు 67 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా ఇప్పటికే 23 మంది కోలుకున్నారు.

‘ఆస్పత్రిలో చేరుతున్న ఒమిక్రాన్‌ బాధితుల్లో 90శాతం మందికి లక్షణాలు ఏమీ ఉండడం లేదు. కేవలం గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. లక్షణాలను బట్టి కేవలం వారికి మల్టీ విటమిన్‌, పారాసెటమాల్‌ మాత్రమే అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఇతర ఔషధాలు ఇచ్చే అవసరం లేదని భావిస్తున్నాం’ అని ఎల్‌ఎన్‌జేపీలోని సీనియర్‌ వైద్యులు వెల్లడించారు. అయితే, విదేశాల నుంచి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వారిలో ఇప్పటికే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోగా.. అందులో కొందరు మూడో డోసు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఆఫ్రికాకు చెందిన ఓ ఎంపీతో పాటు భారత్‌కు చెందిన పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఉన్నట్లు ఎల్‌ఎన్‌జేపీ వైద్యులు పేర్కొన్నారు. ఇక దిల్లీలో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తిని తెలుసుకునేందుకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినవారందరి నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్స్‌ చేపడుతున్నామని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. నగరంలో ఉన్న నిర్ధారణ కేంద్రాల సహాయంతో నిత్యం 300 నుంచి 400 నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు.

ఇదిలాఉంటే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువే ఉండవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్‌ వల్ల ఆస్పత్రి చేరికలు, మరణాల ముప్పు తక్కువేనని అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు చాలా దేశాల్లో నిర్ధారణ అవుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. అయినప్పటికీ ఒమిక్రాన్‌ కట్టడికి అన్ని రాష్ట్రాలు సన్నద్ధం అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని