
Winter Session: ఎంపీల సస్పెన్షన్‌పై ఉభయ సభల్లో గందరగోళం
దిల్లీ: 12 మంది ఎంపీల సస్పెన్షన్ వేటు రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని, ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు, ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. విపక్ష నేతల విజ్ఞప్తిని తిరస్కరించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలంతా కూర్చోవాలని కోరారు.
‘సభ్యుల ప్రవర్తనపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం సభకు ఉంటుంది. ఒకసారి వర్షాకాల సమావేశాల చివరిరోజు రికార్డులను పరిశీలించండి. మీరు సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే సభ్యులు తమ ప్రవర్తనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున.. వారి అప్పీల్ పరిశీలనకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. విపక్ష నేతల అప్పీల్‌ను వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో..వారు సభ నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీ మాత్రం సభలోనే ఉండిపోయింది.
మధ్యాహ్నం రెండువరకు లోక్‌సభ వాయిదా..ఇదే విషయంపై లోక్‌సభలో కూడా సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగింది. సస్పెండ్ అయిన సభ్యులకు మద్దతుగా లోక్‌సభకు చెందిన విపక్ష నేతలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. పలు గందరగోళాల మధ్య లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. అలాగే వాకౌట్ చేసిన సభ్యులంతా పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.