
Punjab: ‘సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. డీజే పెంచు డీజే!’
చండీగఢ్: రాజకీయ నాయకుల పర్యటనల్లో కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తమ పర్యటనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయటం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అయితే అలాంటి వాటికి వినూత్న పరిష్కారం చూపించారు పంజాబ్ పోలీసులు! ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ర్యాలీలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తే.. అక్కడి డీజే సౌండ్ పెంచాలని డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు పోలీసు ప్రత్యేక రక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. గుర్బాని, సంప్రదాయ పాటలను ప్లే చేయాలని అందులో పేర్కొంది. ఇలా చేయటం ద్వారా సీఎంకు వ్యతిరేకంగా చేసే నినాదాలు వినపడకుండా చేయొచ్చని తెలిపారు.
పోలీసుల తాజా ఆదేశాలు రాజకీయంగా దుమారం రేపాయి. ప్రభుత్వం, అధికారుల తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు హర్పాల్ సింగ్ చీమా మాట్లాడుతూ.. ప్రజలు తమ డిమాండ్ల కోసం నిరసనలు చేయడం, తమ గళాన్ని విప్పడం ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఈ ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని బయటపెట్టింది అంటూ విమర్శించారు. విమర్శలు ఎదురైన క్రమంలో డీజే ఆదేశాలపై పంజాబ్ పోలీసులు వివరణ ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల తప్పిదం వల్ల ఆదేశాల అర్థం మారిపోయిందని పేర్కొన్నారు. సీఎం పర్యటనలో అవసరమైన సందర్భాల్లో డీజేలను ఆపాలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. సీఎం వద్దకు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు డీజే సౌండ్ తగ్గించటం వల్ల బాధితుడు.. తన సమస్యను ముఖ్యమంత్రికి వినిపించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.