
అత్యాధునిక ఆయుధాల తయారీకి రష్యా-చైనా జట్టు: పుతిన్
మాస్కో: అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు రష్యా, చైనా దేశాలు జట్టు కట్టాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇప్పటికే చైనా అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థ కలిగి ఉందన్న ఆయన.. సాంకేతికత, అణుశక్తితో పాటు ఇతర రంగాల్లో చైనాతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్ ఈ వివరాలను వెల్లడించారు.
‘వ్యక్తిగత అత్యాధునిక ఆయుధాల తయారీని కలిసి అభివృద్ధి చేస్తున్నాం. అంతరిక్షం, విమానయాన, విమాన-హెలికాప్టర్ల అభివృద్ధిలోనూ ఇరువురం సహకరించుకుంటాం. 2060 తర్వాత చైనాకు కావల్సిన ఇంధన వనరులను సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.
ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడంతోపాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో పాల్గొనడం, సముద్రాల్లో ఉమ్మడి పెట్రోలింగ్ వంటి విషయాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్ఘాటించారు. ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సంబంధంపై మాట్లాడిన ఆయన.. ఇద్దరి మధ్య విశ్వసనీయమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లోనూ ఇవి కొనసాగుతాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.