Vaccine for Children: అక్టోబర్‌ తొలివారంలో జైడస్‌ క్యాడిలా టీకా?

అక్టోబర్‌ మొదటి వారంలో జైడస్‌ క్యాడిలా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయిని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Published : 12 Sep 2021 20:34 IST

సూదిలేకుండా టీకా పంపిణీకి ప్రత్యేక పరికరం

దిల్లీ: సూది అవసరం లేకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కరోనా వ్యాక్సిన్‌ జైడస్‌ క్యాడిలా వినియోగానికి భారత ప్రభుత్వం ఆగస్టులోనే అనుమతి ఇచ్చింది. దీంతో 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చే వీలున్న ఈ వ్యాక్సిన్‌ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ మొదటి వారంలో జైడస్‌ క్యాడిలా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయిని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ రూపొందించిన జైకోవ్‌-డి టీకా వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇవ్వడంతో డోసుల ఉత్పత్తిపై ఆ సంస్థ దృష్టి సారించింది. సెప్టెంబర్‌ మూడోవారం లేదా అక్టోబర్‌ మొదటి వారానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. అక్టోబర్‌ నుంచి నెలకు కోటి డోసులను సరఫరా చేసేందుకు సిద్ధమవుతుండగా.. జనవరి నాటికి నెలకు 4-5కోట్ల డోసుల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తున్నామని జైడస్‌ సంస్థ ఎండీ ఈ మధ్యే వార్త సంస్థలకు వెల్లడించారు.

డీఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన జైడస్‌ క్యాడిలా టీకాను మూడు డోసుల టీకాలను 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12-18 ఏళ్ల ఏళ్ల పైబడినవారిపైనా తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో భారత్‌లో చిన్నారులకు అందుబాటులోకి వచ్చే తొలిటీకా కూడా ఇదే నిలువనుంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాల్లో తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ కూడా ఇదే కావడం విశేషం.

ఇక చిన్నారుల కోసం వ్యాక్సిన్‌లో భాగంగా భారత్‌ బయోటెక్‌ జరుపుతున్న ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు బయోలాజికల్‌-ఇ కూడా చిన్నారుల వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే వీటికి అనుమతులు వచ్చే అవకాశం ఉంది భారత్ ప్రభుత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. మూడోముప్పు నెలకొందని వస్తోన్న వార్తల నేపథ్యంలో చిన్నారుల టీకా కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలాఉంటే, దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాల పంపిణీ జరుగుతున్నాయి.  అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని