Tipu Sultan: రూ. 144 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్‌ ఖడ్గం

టిప్పు సుల్తాన్‌ (Tipu Sultan) ఉపయోగించిన ఓ ఖడ్గం (Sword) వేలంలో ఏకంగా రూ.144 కోట్లు పలికింది. ఇదే ఖడ్గాన్ని గతంలో ఓసారి విజయ్‌ మాల్యా కొనుగోలు చేసి.. మళ్లీ విక్రయించినట్లు తెలుస్తోంది.

Published : 25 May 2023 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ (Tipu Sultan) ఉపయోగించిన ఓ ఖడ్గానికి (Sword) వేలంలో విశేష ఆదరణ లభించింది. 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని లండన్‌లోని బోన్హమ్స్‌ ఆక్షన్‌ హౌస్‌ వేలం (Auction) వేయగా.. ఏకంగా 1,40,80,900 పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.144 కోట్లకు పైమాటే..!

మే 23న ఈ ఖడ్గాన్ని (Sword) బోన్హమ్స్‌ సంస్థ వేలం వేసింది. దీని కోసం ముగ్గురు బిడ్డర్లు విపరీతంగా పోటీ పడ్డారు. చివరకు 14 మిలియన్‌ పౌండ్లకు దీన్ని ఓ బిడ్డర్‌ దక్కించుకున్నట్లు వేలం సంస్థ తెలిపింది. అయితే ఈ ఖడ్గాన్ని ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. కాగా.. తాము అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోయిందని ఆక్షన్‌ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన ఆయుధాల్లో దీన్ని అత్యంత శక్తివంతమైన ఖడ్గంగా భావిస్తారు. టిప్పు ప్యాలెస్‌లోని ప్రైవేటు క్వార్టర్స్‌లో దీన్ని గుర్తించినట్లు బోన్హమ్స్‌ వెల్లడించింది.

కాగా.. ఈ ఖడ్గాన్ని 2003లో విజయ్‌ మాల్యా (Vijay Mallya) లండన్‌లోని ఓ ఆక్షన్‌ హౌస్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో దాన్ని ఆయన ప్రదర్శనకు కూడా ఉంచారట. అయితే, ఆ తర్వాత ఈ కత్తిని ఆయన విక్రయించినట్లు కథనాలు వెలువడ్డాయి. పలు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా.. ఈ ఖడ్గం గురించి 2016లో ఓ ప్రకటన చేశారు. దాని కారణంగా తమ కుటుంబానికి బ్యాడ్‌లక్‌ వచ్చిందని, అందుకే దాన్ని వదిలించుకున్నానని అప్పట్లో మాల్యా చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, దీన్ని ఎవరికి విక్రయించారన్నది మాత్రం ఆయన బయటపెట్టలేదు.

తాజాగా ఇదే ఖడ్గాన్ని బోన్హమ్స్‌ వేలం వేసినట్లు తెలుస్తోంది. అయితే, దీని పాత యజమాని గురించి వేలం సంస్థను అడగ్గా.. వివరాలు చెప్పేందుకు నిర్వాహకులు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని