కేబినెట్ విస్తరణ.. వీరికి ప్రమోషన్‌!

మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రివర్గం రూపురేఖలు మారనున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి కేబినెట్‌ విస్తరణలో భారీ మార్పులే జరుగుతున్నాయి.

Updated : 07 Jul 2021 16:35 IST

దిల్లీ: మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రివర్గం రూపురేఖలు మారనున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విస్తరణలో భారీ మార్పులే జరుగుతున్నాయి. ఇప్పటికే హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌ సహా కేంద్రమంత్రులు పలువురు తమ పదవులకు రాజీనామా చేయడంతో కొత్తవారికి అవకాశం రానుంది. ఇక కొందరు సహాయ మంత్రులను కూడా తాజా విస్తరణలో కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఆయా శాఖలో వారి పనితీరుతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రమోషన్‌ ఇవ్వనున్నారు. 

జి. కిషన్‌ రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, పురుషోత్తం రూపాలా, మనుసుఖ్‌ మాండవీయలను కేబినెట్‌లోకి తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రధాని నివాసానికి రావాలని ఇప్పటికే వీరికి ఆహ్వానం అందింది. దీంతో ఈ ఉదయం వీరు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌కు వెళ్లి మోదీని కలిశారు. 

* కిషన్‌ రెడ్డి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఆయనకు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి కల్పించి.. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

* హిమాచల్‌ప్రదేశ్‌ ఎంపీ అయిన అనురాగ్‌ ఠాకూర్‌ ప్రస్తుతం ఆర్థికశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

* హర్‌దీప్‌ సింగ్‌ పూరి.. కేంద్ర పౌర విమానయానశాఖ, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖలకు సహాయ మంత్రి వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లలో ఆయన పనితీరు బాగుగా ఉండటంతో పాటు వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయనకు కేబినెట్‌ హోదా ఇస్తున్నట్లు సమాచారం. 

* ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ పార్టీ బలోపేతం చేసే దిశగా కిరణ్‌ రిజిజును కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన క్రీడల శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

* ఇక గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా, పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మనుసుఖ్‌ మాండవీయను కేబినెట్‌లో తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. అయితే వీరికి ఏయే శాఖలు ఇస్తారన్నది ఇంకా తెలియరాలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని