
Corona: కరోనా అక్కడ తగ్గుతోంది.. ఇక్కడ పెరుగుతోంది: కేంద్రం
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ ప్రభావంతో పెరుగుతున్న యాక్టివ్ కేసుల్లో దాదాపు 77శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. 11 రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొంది. వీటిలో ఒక్క కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో లక్షకు పైగా ఉన్నాయని వివరించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. దేశంలో 10 వేల నుంచి 50వేల మధ్య యాక్టివ్ కేసులు 14 రాష్ట్రాల్లో; 10వేల కన్నా తక్కువ కేసులు 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ప్రాబల్యమే దేశంలో ఇప్పుడు అధికంగా ఉందన్నారు.
ఆరు రాష్ట్రాల్లో తగ్గుతుండగా.. మరో ఆరు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయ్!
జనవరి 26 వరకు గణాంకాలను పరిశీలిస్తే.. 400 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం పైగా ఉందనీ.. అలాగే, 141 జిల్లాల్లో ఇది 5 నుంచి 10%గా ఉన్నట్టు అధికారులు వివరించారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఒడిశా, హరియాణా, పశ్చిమబెంగాల్‌లో కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతుండగా.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో మాత్రం భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గతేడాది డిసెంబర్ 1 నాటికి జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా 1292 ఒమిక్రాన్ కేసులను గుర్తించగా.. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 9,672కి పెరిగినట్టు తెలిపారు. కొవిడ్ బాధితుల్లో కొందరికి మాత్రమే ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలు అవసరమవుతోందనేది స్పష్టమవుతోందన్నారు. కొవిడ్ వ్యాప్తి సరళిని నిశితంగా గమనించడంతో పాటు జాగ్రత్తలను కొనసాగించాలన్నారు.
వ్యాక్సినేషన్ ఇలా..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 163.84 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. వీటిలో 18ఏళ్లు పైబడిన వారికి 88.98కోట్ల (95%) మందికి తొలి డోసు పూర్తవ్వగా.. 69.52 కోట్ల మందికి (74%) రెండో డోసూ అందించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే 97.03లక్షల మంది హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న 60 ఏళ్లు దాటిన వారికి ప్రికాషన్ డోసు అందించామని వెల్లడించారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు (59శాతం) 4.37 కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. గతేడాది మే 7న సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు 4,14,188 కొత్త కేసులు రాగా.. 3,679 మరణాలు సంభవించాయనీ.. అప్పుడు కేవలం 3శాతం మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ పొందారన్నారు. అదే, థర్డ్‌వేవ్‌లో 2022 జనవరి 21న గరిష్ఠంగా 3,47,254 పాజిటివ్ కేసులు రాగా.. 435 మంది మరణించారనీ.. 75శాతం మంది పూర్తిస్థాయిలో టీకా వేయించుకున్నారని గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ-సంజీవిని పేరిట ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్‌కు మంచి స్పందన వస్తోందనీ.. ఇప్పటివరకు 2.3కోట్ల మందికి పైగా దీనిద్వారా వైద్య సాయం పొందినట్టు తెలిపింది.
ఇవీ చదవండి
Advertisement