‘జెనీలియా భర్త’.. అంటే కోపమొచ్చింది!

దక్షిణాదికి చెందిన ఇద్దరు సెలబ్రిటీలు గతంలో రితేశ్‌ని చూసి.. ‘ఇతను జెనీలియా భర్త’ అని చెప్పుకోవడంతో ఆయనకి కోపమొచ్చిందట. వెంటనే ఆ ఇద్దరు తారలకు సరైన సమాధానమిచ్చారట.ఈ విషయాన్ని తాజాగా రితేశ్‌ ఓ కార్యక్రమంలో వెల్లడించారు...

Published : 23 Oct 2020 02:05 IST

సెలబ్రిటీలకు సమాధానమిచ్చిన రితేశ్‌

ముంబయి: దక్షిణాదికి చెందిన ఇద్దరు సెలబ్రిటీలు గతంలో రితేశ్‌ని చూసి.. ‘ఇతను జెనీలియా భర్త’ అని చెప్పుకోవడంతో ఆయనకు కోపమొచ్చిందట. వెంటనే ఆ ఇద్దరు తారలకు సరైన సమాధానమిచ్చారట. ఈ విషయాన్ని తాజాగా రితేశ్‌ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రితేశ్‌-జెనీలియా దంపతులు తాజాగా ఓ కామెడీ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సరదాగా పంచుకున్నారు.

కాగా, వివాహానంతరం దక్షిణాదికి వచ్చిన సమయంలో జరిగిన ఓ సరదా విషయాన్ని రితేశ్‌ గుర్తు చేసుకున్నారు. ‘మాకు వివాహామైన తర్వాత కొంతకాలానికి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ కోసం బెంగళూరు వచ్చాను. ఆ సమయంలో క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు నన్ను చూసి.. ‘జెనీలియా భర్త ఇతనే’, ‘జెనీలియా భర్త ఇతనే’ అని చెప్పుకున్నారు. ఆ మాటతో నాకు కోపం వచ్చింది. ఇగో హార్ట్‌ అయ్యింది. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి.. ‘దక్షిణాదిలో మాత్రమే ‘జెనీలియా భర్త’ కానీ మహారాష్ట్రలో మాత్రం ‘రితేశ్‌ భార్య జెనీలియా’’ అని సమాధానమిచ్చాను. ‘సర్‌.. రితేశ్‌ భార్య జెనీలియా.. ఇది కేవలం ఒక్క మహారాష్ట్రకి మాత్రమే పరిమితం. కానీ ‘జెనీలియా భర్త రితేశ్‌’ అనేది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక.. ఇలా ఇన్ని రాష్ట్రాల్లో ఉంటుంది’ అని అన్నారు. వాళ్లు చెప్పిన మాటతో నాకు బాగా నవ్వొచ్చింది’ అని ఆనాటి సంగతుల్ని రితేశ్‌-జెనీలియా సరదాగా గుర్తు చేసుకున్నారు.

హా.. హా.. హాసినిగా ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు జెనీలియా చేరువయ్యారు. 2006లో విడుదలైన ఈ సినిమా తర్వాత  తెలుగు, తమిళ, మలయాళీ, మరాఠి, హిందీ సినిమాల్లో ఆమె ఎన్నో అవకాశాలు సొంతం చేసుకున్నారు. సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడ్డారు. అనంతరం పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని