Sivakarthikeyan: తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా

‘రెమో’, ‘సీమరాజా’, ‘శక్తి’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా

Updated : 07 Oct 2021 09:48 IST

‘రెమో’, ‘సీమరాజా’, ‘శక్తి’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా ‘డాక్టర్‌’. నెల్సన్‌ దిలిప్‌కుమార్‌ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ చిత్రం శనివారం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శివ కార్తికేయన్‌.

బయట డాక్టర్లకి.. తెరపై  కనిపించే ఈ ‘డాక్టర్‌’కి తేడా ఏంటి?

‘‘మిగతా డాక్టర్లలాగే ఈ డాక్టర్‌ ఆపరేషన్లు చేస్తుంటాడు. వాటితో పాటు విభిన్నంగా ఇంకొన్ని ఆపరేషన్లు చేస్తుంటాడు. అవేంటన్నది తెరపై చూడాలి. నేనిందులో ఆర్మీ డాక్టర్‌గా కనిపిస్తా. టీజర్లు, ట్రైలర్లలో చూపించినట్లు ఇందులో మానవుల అక్రమ రవాణా, మానవ అవయవాల స్మగ్లింగ్‌ వంటివి అన్నీ ఉన్నాయి. అయితే అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దాని వల్ల ఏం జరిగింది? వాటన్నింటినీ ఈ ఆర్మీ డాక్టర్‌ ఎలా అడ్డుకున్నాడు? అన్నది మిగతా కథ.

మీరే నిర్మించాలని ఎందుకనుకున్నారు?

‘‘దర్శకుడు నెల్సన్‌తో నా ప్రయాణం 2007లో మొదలైంది. నేను టెలివిజన్‌లో పని చేసే రోజుల నుంచే తను నాకు మంచి మిత్రుడు. నేను చేసిన ఓ షోకి తను దర్శకత్వం చేశాడు. తనపై.. తన కథపై ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నా. నెల్సన్‌ ఈ కథని రాసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఇది ప్రత్యేకంగా నాయకానాయికల చుట్టూనో హీరో, విలన్ల చుట్టూనో తిరిగే కథ కాదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యముంది.

ఈ సినిమాలో మీకు బాగా సవాల్‌గా అనిపించినవేంటి?

‘‘ఈ చిత్రంలో నా పాత్రకి ఎలాంటి భావోద్వేగాలుండవు. తనెప్పుడూ ఏడవడు.. నవ్వడు.. అతిగా కోపం ప్రదర్శించడు.. ఏ ఎమోషన్‌ ఉండదు. ఓ మిస్టీరియస్‌ పర్సన్‌లా ఉంటాడు. ఇలా ఎలాంటి ఎమోషన్స్‌ లేకుండా ఓ సీరియస్‌ పాత్రలో నటించడం చాలా  సవాల్‌తో కూడుకున్న పని’’.

ఈ ప్రాజెక్ట్‌ చాలా ఆలస్యమైనట్లుంది కదా..

‘‘కొవిడ్‌ వల్లే ఆలస్యమైంది. తొలి లాక్‌డౌన్‌ సమయానికే మేం 80శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన షూట్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేశాం. అందుకే వేసవికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. ఈలోపు మళ్లీ కరోనా ఉద్ధృతి పెరగడంతో మా ప్రణాళికలు తారుమారయ్యాయి. ఇలాంటి సినిమా థియేటర్లలో చూస్తేనే.. ఆ అనుభూతి తెలుస్తుంది.

కొత్త సినిమాల విశేషాలేంటి?

‘‘తమిళంలో ‘అయ్‌లాన్‌’ అనే సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాను. ఓ ఏలియన్‌ భూమి మీదకి వస్తే ఏమైంది? హీరో.. ఆ ఏలియన్‌ కలిసి ఏం చేశారన్నది ఆ చిత్ర కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ‘డాన్‌’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. ఆ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందన్నది ఇప్పుడే చెప్పలేను.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts