ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్థం కాదు!

సురేఖవాణి, రజిత్‌ కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకున్న ముచ్చట్లు..

Updated : 12 May 2021 12:19 IST

వన్నెతరగని అందంతో నిండైన తెలుగుదనంతో తల్లిగా, చెల్లిగా, అక్కగా వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటిస్తూ  తెలుగు ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్న నటీమణులు రజిత, సురేఖవాణి. ఒకరేమో అమ్మకు తోడుగా నిలుస్తూ తన సోదరిమణుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుండగా, మరొకరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 38 ఏళ్లకే భర్తను పోగొట్టుకొని బిడ్డతో కలిసి స్వతంత్రంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.  ఈ నారీ నటీమణులు తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదా’గా కార్యక్రమానికి విచ్చేసి తమ జీవితంతో  పాటు ఎన్నో సినీ విశేషాలు పంచుకున్నారు. 

కెమెరా ముందుకొచ్చి ఎంతకాలమైంది?

సురేఖవాణి: బుల్లితెరపైకి వచ్చి 22 సంవత్సరాలు అయ్యింది. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిటీ కేబుల్లో యాంకర్‌గా చేశా.

యాంకరింగ్ కోసం వచ్చారా? లేదా యాక్టింగ్‌ కోసం వచ్చారా?

సురేఖవాణి: అనుకోకుండా వచ్చాను. మానాన్న స్నేహితులకు సిటీకేబుల్‌ ఉండేది. మా బాబాయి కూడా అందులో పనిచేసేవారు. అప్పుడప్పుడు అక్కడి వెళ్తుండేదాన్ని. అలా ఓ సారి నా చేత సరదాగా ఓ పోగ్రాం చేయించారు. దాంతో అలా యాడ్స్, చిన్న చిన్న  సినిమా పోగ్రామ్‌లు, ఇంటర్వ్యూలు, ఇవాళ ఈటీవీ వరకూ వచ్చా.

చెన్నైకి మీ పిన్నిని చూద్దామని వెళ్లారా? లేక సినిమాల్లో నటించడానికి వెళ్లారా?

రజిత: మాది కాకినాడ. షూటింగ్‌ చూడ్డానికి వెళ్లా. అలా వెళ్లి నేను ఆర్టిస్టునయ్యాను. నాగేశ్వరరావుగారు నటించిన ‘అగ్నిపుత్రుడు’లో ఆయనకు కూతురిగా నటించాను. అప్పుడు నేను పదోతరగతి చదువుతున్నా. 1987లో ఆ సినిమా విడుదలైంది. చిత్రసీమలోకి వచ్చి 33 ఏళ్లు అయింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించా.

మీ తొలి హిందీ ఏది?

రజిత: ‘ప్రేమఖైదీ’ రీమేక్‌. అందులో కరిష్మా కపూర్ స్నేహితురాలిగా నటించాను.

చిత్రసీమలో అప్పుడు.. ఇప్పుడు.. ఎలా ఉంది?

సురేఖవాణి: 1994లో తొలిసారి నేను సిటీ కేబుల్‌లో కనిపించా. అప్పటికీ ఇప్పటీకీ తేడా ఉందనిపిస్తోంది. టీవీలో చాలా మార్పు కనిపిస్తోంది.

వివాదాలకు సురేఖవాణి కేరాఫ్‌ అడ్రస్సా?

సురేఖవాణి: వివాదాలు అవ్వవు. చేస్తారు. కొన్ని ఇష్యూస్‌ క్రియేట్‌ చేస్తారంతే. అంటే నెగెటివ్‌గా కాదు. కానీ, వైరల్ చేస్తారు. వెబ్‌సైట్స్‌ వాళ్లకు నా మీద అంత  ప్రేమ.

ఈ మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు కదా?

సురేఖవాణి: నవ్వుతూ.. జస్ట్ నేను 40వ సంత్సవరం పుట్టినరోజు జరుపుకొన్నా. నలభైలోకి అడుగుపెట్టానంతే.

అతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్న సురేఖవాణి అని వెబ్‌సైట్‌లో చూశాను?

సురేఖవాణి: అలా రాసేవాళ్లకు నేను కూడా ఒక్కటే చెబుతున్నా. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో చెప్పండి. అంతేకాదు కొంచెం డబ్బులు ఉన్న వాణ్ని చూడండి.

డబ్బు ఉన్నవాడు కావాలా? లేక మనసున్నోడు కావాలా?

సురేఖవాణి: మనసుతో పనేముంది. మనసును ఏం చేసుకుంటాం. మనసుతో పనులు జరగవని అర్థమైంది. అన్ని చూసేశాం కదా.  

మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?

సురేఖవాణి: ప్రేమ వివాహమే. విజయవాడ సిటీకేబుల్లోనే అతని పరిచయం.

అక్కడ నుంచి ఇంత వరకు వస్తారని ఊహించారా?

సురేఖవాణి: అస్సలు ఊహించలేదు. పెళ్లయిన తర్వాత సినిమాలు, యాంకరింగ్‌ అన్ని మానేయాలని అత్తయ్య చెప్పేశారు. కానీ, మా ఆయన ఒప్పుకోలేదు. నా పెళ్లాం నా ఇష్టం ‘నీకు ఇష్టమైన పనిచేసుకో’ అని నాకు చెప్పారు.

‘అగ్నిపుత్రుడు’ చిత్రం తర్వాత ఆర్టిస్టుగా సెటిల్ అయిపోతాననే నమ్మకం కలిగిందా మీకు?

రజిత: అప్పుడు నాకు అస్సలు ఇష్టమే లేదు. అందరు బలవంతపెట్టడంతోనే ఈ సినిమా చేశాను. అన్నపూర్ణ బ్యానర్, రాఘవేంద్రరావు దర్శకుడు. నా ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంది. ఈ సినిమా తర్వాత కొన్ని ఒరియా, మలయాళ, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా చేశా. నాకు చదువుకోవడమంటే ఇష్టం. కానీ 1996లో మద్రాసు నుంచి హైదరాబాద్‌కి వచ్చాక సినిమానే నా జీవితం అని ఫిక్స్‌ అయ్యాను. ఇది దేవుడి వరం.

హైదరాబాద్‌ రాక ముందు ఓ వంద సినిమాల్లో నటించారా?

రజిత: 1987 నుంచి చిత్రసీమలో ఉన్నా కదా 100 సినిమాలు చేసి ఉంటాను.  అప్పట్లో కృష్ణగారితో చేశా. దాదాపు అందరి హీరోలతో చేశా. ఒక్క పెద్ద ఎన్టీఆర్‌తో తప్ప. ఇక అక్కినేని కుటుంబంలో అయితే నాగేశ్వరరావుగారు, నాగార్జున, నాగచైతన్యతోనూ కలిసి పనిచేశా.

అప్పట్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇప్పట్లో ఇష్టమైన కథానాయకుడు ఎవరు?

రజిత: కమల్‌హాసన్‌ అంటే ఇష్టం. కానీ ఆయనతో కలిసి నటించలేదు. ఇప్పట్లో ఉన్న అందరూ ఇష్టమే. అల్లు అర్జున్‌ అయితే సెట్లోకి రాగానే పలకరిస్తూ సందడి చేస్తుంటారు. బన్నీనే కాదు మిగతా హీరోలు కూడా చాలా బాగుంటారు.

మీరేంటి చిరంజీవిని చూడగానే ఏడ్చేశారట? ఆయనతో ఏ సినిమా చేశారు?

సురేఖవాణి: ఎందుకో తెలియలేదు. లోపలి నుంచి భావోద్వేగం వచ్చేసింది. కన్నీళ్లు వచ్చేశాయి. అప్పుడాయన ‘‘మేకప్ పోతుంది. ఏడవకు..ఏడవకు..అంటూ’’ దగ్గరకు తీసుకొని ఓదార్చారు. చిరంజీవి గారితో ‘స్టాలిన్‌’చేశా.  ఆ తర్వాత ఆయన నన్ను పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు. సినిమాలో నటిస్తున్నప్పుడు పక్కన కూర్చొబెట్టుకొని మాట్లాడేవారు.

టీవీ నుంచి సినిమాల్లోకి మీకు రావాలనిపించిందా? లేక టీవీలో మిమ్మల్ని చూసి ఎవరైనా అవకాశం ఇచ్చారా?

సురేఖవాణి: లేదు. నాకు సినిమాల్లో నటించమని అవకాశాలు వచ్చాయి. కానీ నేను తొలుత టీవీ చాలు సినిమా వద్దనుకున్నా. సినిమా రంగంలో ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికే నాకొక పాప ఉంది. కానీ అవకాశాలు వస్తుండంతో సినిమాల్లో నటించాను.

మీ మొదటి చిత్రం ఏది?

సురేఖవాణి: పెళ్లికి ముందు చేసిన చిత్రం ‘తెలుగోడు’, ఆర్‌.నారాయణమూర్తిగారి సినిమా. సంజీవ్‌ దర్శకుడు. ఆయన మాకు బంధువు అవుతారు. ఇందులో నా చిన్న పాత్ర. ఆ తర్వాత హిందీలో ఒకట్రెండు సినిమాల్లో నటించా. ఇదంతా పెళ్లికి ముందు. నేను 18 ఏళ్లకే పెళ్లి చేసుకొని 20 ఏళ్ల ఓ బిడ్డకు తల్లినయ్యాను. మధ్యలో ఆలీ అందుకుంటూ (బాధతో) 38 ఏళ్లకే భర్త చనిపోయారు. మీకొక పాప ఉంది కదా..

మీ అమ్మాయి ఏం చేస్తోంది?

సురేఖవాణి: దానికి ఏడో తరగతి నుంచే కన్‌ఫ్యూజన్ ఉంది. ఒక్కోసారి ఫ్యాషన్‌ డిజైనింగ్ చేస్తానంటోంది. మరోసారి డీజే అవుతానంటోంది. కానీ ఫ్యాషన్‌ డిజైన్ అయితే బాగుంటుందని ప్రస్తుతం ఆ పనిచేస్తోంది. కానీ సినిమా రంగం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఏం చేయాలో నాకర్థం కావడం లేదు. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్ చేసింది. చాలా బాగా యాక్టింగ్‌ చేస్తుంది.

అంత చిన్న వయసులో మీవారు చనిపోవడానికి కారణం ఏమిటి?

సురేఖవాణి: ఆరోగ్య సమస్యలతోనే. ఇప్పటికీ నాకొక కలలాగే ఉంది. ఆ విషయం గుర్తుకొస్తే బాధపడకుండా ఉండలేను. ఆయనకు పదేళ్ల నుంచి డయాబెటిక్ ఉంది. కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ అయ్యేది. చాలా ట్రీట్‌ మెంట్స్ కూడా జరిగాయి. కానీ, చివరకు కాలిలో బ్లడ్ క్లాట్‌ అవ్వడంతో వేలు తీసేశారు. దాంతో ఆయన ఒక నెల లోపే చనిపోయారు. ఎప్పుడైతే వేలు తీసేశారో దానికి కృతిమ వేలు పెట్టిద్దామనుకున్నాం. ‘భయపడకు’ అని ఆయన ధైర్యం చెప్పేదాన్ని. కొన్నిసార్లు నేను బాధపడుతుంటే ఆయన ధైర్యం చెప్పేవారు. అంతా బాగుందనుకునేలోపు గుండెపోటు వచ్చింది. ఆయాసంగా ఉందంటే మళ్లీ బ్లడ్‌ ఏమైనా క్లాట్ అయ్యిందేమోనని అనుకున్నా. మేం ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పల్స్ దొరకడం లేదని చెప్పేశారు. కేవలం అరగంటలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయాన నేను నా డ్రైవర్ తప్ప మాకెవ్వరు తోడు లేరు.

మీ భర్త (తేజ) కుటుంబం మీతో బాగుంటుందా?

సురేఖవాణి: లేదు. వాళ్లు మమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఆయనకు ఉద్యోగం లేకపోయినా ఎలా చూసుకున్నానో ప్రపంచంలో అందరికీ తెలుసు. ట్రీట్‌మెంట్‌ కోసం లక్షలు ఖర్చు అయ్యాయి. కానీ వాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతేకాదు ఆయనకు ఆరోగ్యం బాగా లేక వేలు తీసినప్పుడు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. నేను, పాప మాత్రమే ఆయన్ను చూసుకున్నాం. నేనేంటనేది భగవంతుడికి, నా భర్తకి (తేజ) నాకు మాత్రమే తెలుసు. ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉంటాయి.

మరి మీ అమ్మానాన్నల నుంచి ఎలాంటి సహకారం ఉంది?

సురేఖవాణి: మొదటి నుంచీ కూడా అమ్మవాళ్లు ఈ విషయాలు తెలుసు. ‘మీ అత్తగారి కుటుంబాన్ని సాయం అడగవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. ‘నా భర్తకి నేను చేస్తాను. వాళ్ల అన్నదమ్ములు ఎందుకు చూస్తారు. నా ఊపిరి ఉన్నంత వరకూ ఆయనకు సేవ చేసుకుంటా’ అని చెప్పా.

భవిష్యత్తు గురించి ఏమి ఆలోచిస్తున్నారు?

సురేఖవాణి: ఏం లేదు. గాలిలో దీపం పెట్టి ఎదురుచూస్తున్నా. భగవంతుడి దయ ఆయన ఏం చేస్తే అదే. నా జీవితంలో ఏదీ ఆశించను. అలాంటివి ఏమీ ఆశించకపోవడం చేతనేమో ఎప్పుడూ సంతోషంగా ఉంటాను.

‘ఈ మధ్య సురేఖవాణి సినిమాలు చేయడం లేదు. ఏవో సమస్యలు ఉన్నాయట. డేట్స్ ఇచ్చినా రాదట’ అనే టాక్ వినిపిస్తోంది?

సురేఖవాణి: ఇలాంటి మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వింకా సినిమాలు చేస్తున్నావా? అని ఫోన్‌ చేసి అడిగితే తెలుస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి రూమర్స్ వస్తాయో అర్థం కాలేదు. ‘సురేఖవాణి సెటిలైపోయింది. సినిమాలు మానేసింది’ అంటున్నారు. మేం ఏం సెటిల్‌ అయ్యాం. నాకర్థం కాలేదు. సెటిల్ అయ్యాం అంటే ఏంటి? అలా అనుకుంటే నాగార్జునగారు, చిరంజీవిగారు, రామ్‌ చరణ్, బన్నీ సహా మా ముందు కూర్చున్న (ఆలీ) మీరంతా ఇంకా ఎందుకు పనిచేయాలి? మీరంతా పడే కష్టం ముందు నేనెంత? పనిచేసుకోకుండా ఏం చేయాలి? అస్సలు ఇలాంటి రూమర్స్‌ ఎందుకు పుట్టించారో తెలియదు. కారు, ఇల్లు కొనుక్కుంటే జీవితం సెటిల్‌ అయ్యినట్లేనా. సినిమానే నా జీవితం.

విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’లో నటించారట? కానీ ఎందుకు ఎడిటింగ్‌లో తీసేశారు?

సురేఖవాణి: ఏమో నాకు తెలియదు. అందులో చాలా మంచి పాత్ర. ఎడిటింగ్‌లో ఎత్తేశారు. థియేటర్‌లో ఆ పాత్ర లేదు. కానీ ఓటీటీలో వచ్చినప్పుడు యాడ్ చేశారట. దానికి మంచి మీమ్స్ వచ్చాయి. సురేఖవాణి నటించిన సన్నివేశాలు బాగున్నాయని అన్నారు. అయినా ఎందుకు తీసేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.

ఇతర భాషల్లో ఎన్ని సినిమాలు చేశారు? యాంకరింగ్, సీరియల్, సినిమా వీటిలో మీకు బాగా ఇష్టమైనది?

సురేఖవాణి: తమిళ, హిందీలో. పెళ్లి కాక ముందు మిథున్‌ చక్రవర్తి సోదరిగా, జాకీష్రాఫ్‌తో పనిచేశా. నాకు చాలా ఇష్టమైనది యాంకరింగ్‌. ఎందుకంటే నాలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకొచ్చింది. 

మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు?

సురేఖవాణి: అన్నయ్య -  నేను. ఆయన ఉద్యోగం చేస్తున్నారు. అమ్మానాన్న విజయవాడలో ఉంటారు. 

‘బాహుబలి’లో కట్టప్పలా మీ కాళ్లు తీసుకొని నెత్తిన పెట్టుకున్నారట ఏమిటా కథ?

రజిత: అది యూఎస్‌లో జరిగింది. ఓ ఈవెంట్‌కి అక్కడికి వెళ్లాం. ఆయనకు ఆర్టిస్టులంటే చాలా అభిమానం. కానీ ఆయన అప్పటి వరకూ సినిమా తారలను చూడలేదట. మేడం ఒకసారి మీ కాళ్లను తాకి దండం పెట్టుకుంటా అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆయన అక్కడ నుంచి కదల్లేదు. చివరకు నా దగ్గరకు వచ్చి దేవుడికి దండం ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటూ నా కాళ్లను తన తలమీద పెట్టుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది. ఆర్టిస్టులంటే అంత క్రేజ్‌ ఉంటుందని.  ఊహించలేదు. షాకయ్యాను.

పెళ్లెందుకు చేసుకోలేదు?

రజిత:  మేం మా కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నేను అమ్మ కడుపులో ఉండగానే నాన్న చనిపోయారు. నాన్నను నేను చూడలేదు. మేం ఇంట్లో నలుగురం ఆడవాళ్లమే. ఏం పనికి వెళ్లినా మగరాయుళ్లా ఉండేవాళ్లం. నేను 8వ తరగతికి వచ్చేసరికి అక్కలిద్దరికీ పెళ్లి అయింది. అమ్మా నేను మాత్రమే ఉండేవాళ్లం. అమ్మ కూడా చాలా చిన్నవయసులోనే భర్తను కోల్పోయింది. అంత చిన్న వయసులోనే అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమెలా మనం ఉండలేమా? ఆమెకు తోడుగా ఉండలేమా? అనిపించింది. పెళ్లి వైపు ఎప్పుడూ ఆలోచించలేదు. నా కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో నాకెంతో సపోర్టుగా నిలిచారు.

షూటింగ్‌ లేని సమయంలో టైం పాస్‌ ఎలా? మీరేం చదువుకున్నారు?

రజిత: సామాజిక సేవ చేస్తుంటాను. (మధ్యలో సురేఖ కల్పించుకుంటూ..చాలా బాగా సోషల్‌ సర్వీస్ చేస్తుంటుంది. ఇక కుటుంబంలో తన అక్కాచెల్లెళ్ల పిల్లలను కూడా చదివించింది) వాళ్లు బాగా కష్టపడి చదువుకోవడం వల్లే చదివించాను. నేను ఇంటర్ మధ్యలోనే మానేశా. 

ఇద్దరి కారణంతో ట్రైన్ జర్నీ చేయడానికి భయపడి మానేశారట.. ఎవరా ఇద్దరు?

రజిత: అప్పట్లో మద్రాస్ నుంచి హైదరాబాద్‌ రావడానికి ఫస్ట్ క్లాస్ కూఫెలు ఉండేవి. అలా నేను ఒకసారి ప్రయాణిస్తున్నప్పుడు వాష్‌ రూమ్‌కి వెళ్లి వచ్చేటప్పుడు ఎదురుగా నిల్చున్న ఒకతను నన్ను గట్టిగా పట్టుకొని హగ్‌ చేసుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత అతన్ని విదిలించుకొని వచ్చేసి నాతోటి ఆర్టిస్టులకు చెప్పేసరికి అతను వేరే కంపార్ట్‌మెంట్లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు ఫోబియా పట్టుకుంది. రైలుల్లో ఒక్కదాన్నే వెళ్లాలంటే భయం. ఆ తర్వాత ఓ టీసీ అతి అభిమానంతో ఆర్‌ఏసీ టికెట్‌ ఓకే చేసి ‘మీరు విజయవాడ వరకూ నాతోనే కూర్చొని ప్రయాణం చేయాలి’ అని చెప్పడంతో ఇబ్బంది పడ్డాను.

ఏదో సినిమా షూటింగ్‌లో స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడిపోతే శ్రీహరి రక్షించాడట?

రజిత: అవును. అది కృష్ణగారు హీరోగా నటించిన ‘బొబ్బిలిదొర’ చిత్రం. ఈ సినిమాలో సన్నివేశం ఏంటంటే కాలేజీలో నన్ను ర్యాగింగ్‌ చేస్తూ స్విమ్మింగ్ ఫూల్‌లో తోసేయాలి. ‘సార్ నాకు ఈత రాదు’ అని నేను ముందే చెప్పా. ‘ఏమీ లేదు. నిన్ను తోసేయగానే మనవాళ్లు వచ్చి బయటకు లాగేస్తారు’ అని చెప్పారు. షాట్ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు. నేను స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఉండిపోయా. ఇక నా జీవితం ముగిసిందనుకుంటూ నీళ్లు తాగేస్తున్నా. అక్కడే శ్రీహరి ఉన్నారు. ఆయనకు షాట్ లేదు. నన్ను గమనించిన ఆయన ఒక్కసారిగా దూకేసి  అమాంతంగా తన చేతులతో బయటపడేశారు. ఆయన పర్సనాలిటీ ఏంటో మనకు తెలిసిందే కదా. అప్పుడు శ్రీహరి నా ప్రాణాలు కాపాడారు. 

ఇటీవల మీకు తెగ ప్రపోజల్స్ వస్తున్నాయట?

సురేఖవాణి: అప్పటి కంటే ఇప్పుడే బాగున్నానని మీరే అన్నారుగా.. ఇప్పుడే బాగా నచ్చుతున్నానేమో.  పైగా ఇప్పుడు సింగిల్‌.

డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీకు మూడు రకాల ఆప్షన్స్ ఇస్తా.. వాటిలో గుడికి, షాపింగ్‌కి..పబ్‌కి.. ఎక్కడకు వెళ్తారు?

సురేఖవాణి: ఇరికించవచ్చుగానీ, ఇంత ఘోరంగా ఇరికించకూడదు (నవ్వుతూ) ముందు దేవుడిని తలుచుకుంటా. ఆ తర్వాత షాపింగ్‌కి వెళ్లి డ్రెస్ కొనుక్కొని పబ్‌కి వెళ్తా. పొద్దునే డిప్రెషన్‌ మూడ్‌లో గుడికి వెళ్తా. మధ్యాహ్నం షాపింగ్‌కి వెళ్తా. సాయంత్రం నా కూతురుతో కలిసి పబ్‌కి వెళ్తా. నా మూడ్ మార్చేందుకు మా అమ్మాయి విశ్వప్రయత్నాలు చేసి బయటకు తీసుకెళ్తుంది.

వంద ముద్దులు ఇవ్వాలంటే ఏ హీరో గుర్తుకు వస్తారు?

సురేఖవాణి: పవన్‌ కల్యాణ్‌

రజిత: ప్రభాస్ డార్లింగ్‌ 

కత్తిలా ఉందనిపించే కథానాయిక ఎవరు?

సురేఖవాణి, రజిత: శ్రీదేవి తర్వాతే ఎవరైనా

తెలుగు చిత్రసీమలో మహా చిలిపి అనే క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎవరు?

రజిత, సురేఖవాణి: (నవ్వతూ): మీరే (అలీ)
రజిత: లేడీ ఆర్టిస్టుల్లో అయితే సురేఖనే ఆమెతో కలిసి పనిచేసిన వాళ్లందరికీ తెలుసు.

మిస్టర్‌ మొహమాటం అనగానే గుర్తుకొచ్చే ఆర్టిస్టు ఎవరు? ఈ ఫోన్‌ వస్తే వదలడురా బాబోయ్‌ అనిపించే వ్యక్తి ఎవరు?
సురేఖవాణి: అలా చెప్పాలంటే వాటిలో నాలుగైదు ఉన్నాయి. వాళ్ల ఫోన్స్ వచ్చినప్పుడు విసిరేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి.  చాలా ఇరిటేటింగ్‌ కాల్స్ వస్తుంటాయి. 

రజిత: అలాంటి ఫోన్స్ నాకు రావు. మొదట్లోనే ఒకసారి మాట్లాడతాం. తర్వాత కట్ చేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని