Bhola shankar: చిరంజీవితో వివాదం.. రూమర్స్‌కు చెక్‌ పెట్టిన అనిల్‌ సుంకర

Bhola shankar: ‘భోళా శంకర్‌’ వివాదంపై నిర్మాత అనిల్‌ సుంకర్‌ స్పందించారు.

Updated : 17 Aug 2023 19:29 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రూమర్స్‌ కొంతమందికి క్రూరమైన వినోదాన్ని పంచవచ్చని, కానీ అనుక్షణం కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం నిజంగా నేరమేనని నిర్మాత అనిల్‌ సుంకర (Anil Sunkara) అన్నారు. చిరంజీవి (chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’ (Bhola shankar). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ క్రమంలో కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్‌ విషయంలో చిరంజీవి పట్టుబట్టడంతో నిర్మాత అనిల్‌ సుంకర ఇల్లు, తోటలను విక్రయించాల్సి వచ్చిందని వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే స్పందించగా, తాజాగా అనిల్‌ సుంకర ట్వీట్ చేశారు.

‘‘పుకార్లు కొంతమంది వ్యక్తులకు క్రూరమైన వినోదాన్ని పంచవచ్చు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వార్తల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను గురవుతున్నాయి. నాకూ చిరంజీవిగారికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో అణువంత నిజం కూడా లేదు. ఆయన అన్ని విధాల సహకారం అందించే వ్యక్తి. సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ మా మధ్య మంచి స్నేహం ఉంది. నిజాలు కప్పిపెట్టి, విద్వేషపూరిత వార్తలను దయ చేసి వ్యాప్తి చేయకండి. ఫేక్‌ న్యూస్‌ సృష్టించడం కొందరికి సరదా. కానీ, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో మరింత బలంగా తిరిగి మీ ముందుకు వస్తాం’’అని అనిల్‌ సుంకర ట్వీట్ చేశారు.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ తెరకెక్కించారు. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ.100కోట్లతో నిర్మించిన  ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్ల వరకూ వసూలు చేసిన ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు