Bhagavanth Kesari: హరికృష్ణ మూవీని బాలకృష్ణ రీమేక్‌ చేస్తున్నారా? ‘భగవంత్‌ కేసరి’ టీమ్‌ రిప్లై!

Bhagavanth Kesari: బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ రీమేక్‌ అంటూ వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.

Updated : 15 Aug 2023 15:14 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ కామెడీ మూవీ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా దసరా కానుకగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణ లుక్‌, డైలాగ్‌ డెలివరీ కొత్తగా ఉండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ‘స్వామి’ చిత్రానికి రీమేక్‌ అంటూ  ఓ వార్త సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది.  దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది.

ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్‌ చేశారు!

హరికృష్ణ, మీనా, ఉమ కీలక పాత్రల్లో వీఆర్‌ ప్రతాప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వామి’. పోసాని కృష్ణమురళి రచయితగా పని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. తన చెల్లెళ్ల మరణానికి కారణమైన వ్యక్తులపై స్వామి, అతని భార్య ఎలా పగ తీర్చుకున్నారన్నదే ఈ చిత్ర కథ. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి, ‘భగవంత్‌ కేసరి’గా రూపొందిస్తున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.  ‘‘2004లో వచ్చిన స్వామి చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’ అనధికార రీమేక్‌ నిజమేనా’ అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేయగా, దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ ‘అది నిజం కాదు. నిజం ఏంటో అక్టోబరు 19న తెలుస్తుంది. ఇంతకు ముందెప్పుడూ చూడని నందమూరి బాలకృష్ణ నటనను తెరపై చూస్తారు’ అని సమాధానం ఇచ్చింది.

మరి నేలకొండ భగవంత్‌ కేసరిగా బాలకృష్ణ ఎలా నటించారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బాలకృష్ణ మార్క్‌యాక్షన్‌, అనిల్‌ రావిపూడి శైలి కామెడీ టైమింగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ టాక్‌. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ప్రియాంక జవాల్కర్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు