అల్లు అర్జున్‌తో మురుగదాస్‌ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

తమిళంలో స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఏఆర్‌. మురుగదాస్‌. రజనీకాంత్‌తో ‘దర్బార్‌’ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.

Updated : 01 Apr 2023 18:38 IST

హైదరాబాద్‌: తమిళంలో స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఏఆర్‌. మురుగదాస్‌. రజనీకాంత్‌తో ‘దర్బార్‌’ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. అల్లు అర్జున్‌తో నేరుగా తెలుగు సినిమా చేస్తారని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. తాజాగా ఆయన నిర్మించిన ‘16 ఆగస్టు 1947’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ సినిమాపై స్పష్టత ఇచ్చారు. ‘‘కరోనా కారణంగా అందరికీ గ్యాప్‌ వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వమే చెప్పింది. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివాను. కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తూ వచ్చాను. కొత్త ఏదైనా నేర్చుకోవాలనుకున్నా. అందుకే కాస్త గ్యాప్‌ వచ్చింది. హీరో తన కెరీర్‌లో చాలా మంది దర్శకులను కలుస్తాడు. అలాగే డైరెక్టర్‌ కూడా అనేకమంది హీరోలను కలుస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్టు మొదలువుతుంది. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. ఇంతకు మించి నేనేదో చెబితే అదే హెడ్డింగ్‌ పెడతారు. ‘16 ఆగస్టు 1947’ కోసం చిత్ర బృందం కోసం రాత్రీపగలూ పనిచేశారు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుందాం’’ అన్నారు.

‘‘తెలుగులో కచ్చితంగా ఒక సినిమా చేస్తా. ప్రేక్షకుడి అంచనాలు, దర్శకుడి క్రియేటివిటీ కలిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్టవుతుంది. ఎప్పుడైనా సరే ప్రేక్షకుడి అంచనాలను అందుకోగలగాలి. ఒక సినిమా హిట్టయినా, యావరేజ్‌గా ఆడినా, ఆఖరికి ఫ్లాప్‌ అయినా దానికి పడిన కష్టం ఒక్కటే. ‘ఠాగూర్‌’ నుంచి మధు, ప్రసాద్‌లతో మంచి పరిచయం ఉంది. కలిసి కూడా పనిచేశాం. ‘16 ఆగస్టు 1947’ చిత్రాన్ని 20 రోజుల కిందటే వాళ్లు చూశారు. బాగా నచ్చింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే, ఆ మేజిక్‌ పోతుంది. ప్రస్తుతం ఓటీటీలు కూడా అందుబాటులో వచ్చాయి. ఇతర భాషల చిత్రాలను చాలా మంది సబ్‌టైటిల్స్‌లో చూసేస్తున్నారు. అందుకే డబ్‌ చేస్తున్నాం’’ అని మురుగదాస్‌ చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే, గౌతమ్‌ కార్తిక్‌ హీరోగా ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ మూవీ ‘16 ఆగస్టు 1947’. ఈ సందర్భంగా గౌతమ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇంత మంచి ప్రాజెక్ట్ లో భాగం చేసిన మురుగదాస్‌ గారికి కృతజ్ఞతలు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది. దర్శకుడు చాలా గొప్పగా తీశారు. తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. చాలా మంచి సినిమా. మీ అందరి ఆదరణ కావాలి’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు