‘మీరు ఒంటరి కాదు’: దీపికా పదుకొణె

‘కుంగుబాటు, ఆందోళన కూడా ఇతర జబ్బుల లాంటివే.. వాటిని మనం నయం చేసుకోవచ్చు. నా సొంత అనుభవమే ఇందుకు ఉదాహరణ’ అని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. స్విట్జర్లాండ్‌లోని

Published : 21 Jan 2020 12:19 IST

దావోస్‌: ‘కుంగుబాటు, ఆందోళన కూడా ఇతర జబ్బుల లాంటివే.. వాటిని మనం నయం చేసుకోవచ్చు. నా సొంత అనుభవమే ఇందుకు ఉదాహరణ’ అని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో దీపిక ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ అవార్డును అందుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుంగుబాటుపై ఆమె చేసిన పోరాటాన్ని పంచుకున్నారు. 

‘‘మానసిక రుగ్మతపై నేను పెంచుకున్న ప్రేమ, ద్వేషమే నాకు జీవితం గురించి ఎంతో నేర్పింది. కుంగుబాటుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే.. ‘మీరు ఎప్పుడూ ఒంటరి కాదు’. డిప్రెషన్‌ అనేది సాధారణమే కానీ తీవ్రమైన సమస్య. అయితే ఇతర రోగాల మాదిరిగానే ఇది కూడా ఒక జబ్బు మాత్రమే అని, దాన్ని నయం చేసుకోగలమని మనమంతా అర్థం చేసుకోవాలి. కుంగుబాటును నేను కూడా అనుభవించాను. అయితే ఆ అనుభవమే ఇప్పుడు మానసిక రుగ్మతలపై నేను పోరాటం చేసేలా ప్రోత్సహించింది. అలాంటి వారి కోసం Live Love Laugh ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసేలా చేసింది’ అని దీపిక చెప్పుకొచ్చారు. 

మానసిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం దీపిక చేస్తున్న కృషికి గానూ ఈ క్రిస్టల్‌ అవార్డును అందించారు. కెరీర్‌ తొలినాళ్లలో తాను డిప్రెషన్‌తో బాధపడ్డానని, అయితే ఇప్పుడు దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని దీపిక పలుమార్లు బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. తన సొంత అనుభవం నుంచి స్ఫూర్తి పొందిన దీపిక.. కుంగుబాటుతో బాధపడుతున్న వారి కోసం ‘ Live Love Laugh’ పేరుతో ప్రత్యేకంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.  అంతేగాక, ఉచిత సైకియాట్రిక్‌ చికిత్సలు కూడా చేయిస్తున్నారు.

దావోస్‌లో దీపిక.. మరిన్ని చిత్రాల కోసం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని