Diana: డయానా.. బయోపిక్‌ల రారాణి!

చిన్నచితకా నటుల నుంచి హాలీవుడ్‌ స్టార్లదాకా ప్రతి ఒక్కరికీ ఓ డ్రీమ్‌ రోల్‌ ఉంటుంది. ఒక్కసారైనా

Published : 20 Nov 2021 10:44 IST

చిన్నచితకా నటుల నుంచి హాలీవుడ్‌ స్టార్లదాకా ప్రతి ఒక్కరికీ ఓ డ్రీమ్‌ రోల్‌ ఉంటుంది. ఒక్కసారైనా ఆ పాత్ర పోషించాలని ఉంటుంది. ఇంతకీ ‘ఆ’ ఆశ ఏంటో తెలుసా? అత్యధికమంది హీరోయిన్లు, ముఖ్యంగా హాలీవుడ్‌ నటీమణులు కోరుకునే పాత్ర ప్రిన్సెస్‌ డయానా (Princess Daiana) బయోపిక్‌లో నటించడం. ఔను మరి! ఆ అతిలోక సౌందర్యరాశి, మనసున్న మారాణి జీవితపాత్రలో నటించడం వాళ్లకో గౌరవం. అందుకే ప్రపంచంలో అత్యధిక బయోపిక్‌లు వచ్చింది డయానాపైనే. ఇప్పటిదాకా డయానా జీవితచరిత్ర (Diana Life Story) పై 11 సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఎవరెవరు అందులో నటించారు? హిట్‌ అయిన సినిమాలేంటి అంటే...!

సెరీనా స్కాట్‌ థామస్‌: ప్రిన్సెస్‌ డయానా చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి బయోపిక్‌, బయో డాక్యుమెంటరీ ఇది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఆండ్రూ మార్టన్‌ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో సెరీనా నటించింది. బ్రిటీష్‌ రాచ కుటుంబం.. ప్రిన్స్‌ ఛార్లెస్‌, డయానా మధ్య వచ్చిన మనస్పర్థలు, సంసారంలోని పొరపొచ్చాలు, వివాదాలు, విడాకులు, డయానా ఇతరులతో నడిపిన ప్రేమాయణం.. వీటన్నింటినీ ఈ చిత్రంలో చూపించారు.


జెనివీవ్‌ ఓ రీలీ: అందంతోనే కాదు.. సమాజ సేవతో అంతులేని జనాభిమానం సంపాదించిన ప్రిన్సెస్‌ డయానాపై వచ్చిన డాక్యుమెంటరీ డ్రామా ‘పీపుల్స్‌ ప్రిన్సెస్‌’. 2007లో టీఎల్‌సీ ఛానెల్లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీలో జెనివీవ్‌ ఓ రిలీ నటించింది. డయానా జీవించిన ఉన్న కాలంలో తీసుకున్న ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూనే, మధ్యమధ్యలో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ డాక్యుమెంటరీని మలిచారు. డయానా 1997లో కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యేవరకూ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ఇందులో చూపించారు.


బోనీ సాపర్‌: ఒకటి కాదు.. రెండుసార్లు ఈ హలీవుడ్‌ నటి డయానా బయోపిక్‌లలో ఒదిగిపోయింది. హ్యారీ అండ్‌ మేగన్‌: ఏ రాయల్‌ రొమాన్స్‌, హ్యారీ అండ్‌ మేగన్‌: బికమింగ్‌ రాయల్‌ అనే రెండు బయో సినిమాల్లో లేడీ డయానా పూర్తి జీవితాన్ని తెరకెక్కించారు. 2018, 2019 సంవత్సరాల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో హీరోలు మారినా.. బోనీ సాపర్‌ మారలేదు. తను నటించలేదు.. జీవించింది అనేంత పేరు సంపాదించుకుంది.


ఎమ్మా కారిన్‌: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ది క్రౌన్‌’ బాగా పాపులరైన ఓటీటీ సిరీస్‌. ఇందులో యంగ్‌ డయానాగా నటించింది ఎమ్మా కారిన్‌. డయానా గురించి బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో వ్యక్తిగత వివరాలు ఇందులో ప్రస్తావించారు. పోలికలు అచ్చుగుద్దినట్టు లేకపోయినా హావభావాలు, హుందాతనం, నటన విషయంలో డయానాని దించేసినట్టు ఎమ్మాని అంతా పొగిడారు. కాకపోతే ఈ సిరీస్‌ ఐదో సీజన్‌లో ఎమ్మా స్థానంలో ఎలిజబెత్‌ డెబికీని తీసుకున్నారు.


క్రిస్టెన్‌ స్టివార్ట్‌: తాజాగా ‘స్పెన్సర్‌’ చిత్రంలో డయానా పాత్ర పోషించింది స్టార్‌ హీరోయిన్‌ క్రిస్టెన్‌ స్టివార్ట్‌. డయానా బ్రిటీష్‌ రాచకుటుంబంలో ఇమడలేకపోయిన వైనం, ప్రిన్స్‌ ఛార్లెస్‌తో వివాదాలు, తదనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురై విడాకులు తీసుకోవడం.. సైకలాజికల్‌ డ్రామా ఆధారంగానే ఈ సినిమా నడిపించారు. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టింది.


జెన్నా డీ వాల్‌: డయానాకి మ్యూజిక్‌, సినిమాలపై ఉన్న ఆసక్తిని ప్రధానంగా చూపిస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో తెరకెక్కిన ఓటీటీ ‘డయనా: ది మ్యూజికల్‌’. ఈ బయోపిక్‌లో జెన్నా నటించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చివరి వీడియో చిత్రం ఇదే. ఈ ఏడాదే రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని