HanuMan: ఒక్క రుధిరమణి కోసం వంద తయారు చేశా!

చిన్న సినిమాగా మొదలై..అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచి.. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్‌ హీరో సినిమాని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించారు.

Updated : 04 Feb 2024 08:22 IST

చిన్న సినిమాగా మొదలై..అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచి.. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం ‘హను-మాన్‌’ (HanuMan). తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్‌ హీరో సినిమాని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించారు. ఈ చిత్ర విజయంలో ముఖ్య భూమిక పోషించిన అంశాల్లో టి.నాగేంద్ర (Nagendra Tangala) ఆర్ట్‌ వర్క్‌ కూడా ఒకటి. ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’, ‘విరూపాక్ష’ లాంటి విజయవంతమైన సినిమాలకు కళా దర్శకుడిగా పని చేసిన ఆయన.. ‘హను- మాన్‌’ కోసం అంజనాద్రి అనే ఓ ఊహా ప్రపంచాన్ని నిర్మించి అందర్నీ మెప్పించాడు. ఈ సినిమా తాజాగా రూ.300కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో నాగేంద్ర ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.  

‘‘హను-మాన్‌’ విజయవంతమవుతుందని నమ్మాం కానీ, ఇంత భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందని అసలు ఊహించలేదు. యాడ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నప్పటి నుంచి దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో (Prasanth Varma) నాకు పరిచయం ఉంది. ఆయనతో ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ సినిమాలకు పని చేశా. ప్రశాంత్‌ ఎప్పుడూ చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లెక్కలేసుకోడు. ఆయనెప్పుడూ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ అనుభూతి అందివ్వాలన్న ఆలోచనతోనే ఉంటారు. మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తుందన్నది ప్రశాంత్‌కు ఐదారేళ్ల ముందు నుంచే తెలుసు. ప్రశాంత్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ నేపథ్యం నుంచి వచ్చినవాడు కావడం వల్ల ఈ చిత్ర విషయంలో ఎంత వరకు సెట్‌ వర్క్‌పై ఆధారపడాలి.. దేన్ని గ్రాఫిక్స్‌లో చూపించాలన్న స్పష్టత ఉంది. ‘హనుమాన్‌’ను చిత్రీకరించడానికి ఎంత టైమ్‌ తీసుకున్నారో.. అంతకు మించిన టైమ్‌ను విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం కేటాయించారు ప్రశాంత్‌ వర్మ. దాని వల్లే ఇంత అద్భుతమైన అవుట్‌పుట్‌ వచ్చింది’’.

పంచభూతాల మధ్య అందమైన ఊరిలా..

‘‘దర్శకుడు ప్రశాంత్‌ ఈ కథ చెప్పినప్పుడే అంజనాద్రి కోసం తప్పకుండా ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఫాంటసీకి, రియాలిటీకి దగ్గరగా ఉండాలి.. అదే సమయంలో చాలా సహజంగా ఉండాలని అనుకున్నాం. చుట్టూ పచ్చటి వాతావరణం.. ఎత్తైన కొండలు.. ఓవైపు నది.. ఇలా పంచభూతాల మధ్య అందమైన ఊరిలా నిర్మించాలనుకున్నాం. ఈ వాతావరణానికి కాస్త దగ్గరగా ఉండేలా హైదరాబాద్‌ దగ్గర్లోని వట్టినాగులపల్లిలోని ఓ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని అక్కడే అంజనాద్రిని సెట్‌ల రూపంలో నిర్మించాం. దీనికి కోసం దాదాపు 150నుంచి 200రోజులు పట్టింది. ఈ సినిమాలో కనిపించే హనుమంతు - గెటప్‌ శీను ఇళ్లు, అంజనాద్రి ఊరు, కుస్తీ జరిగే కోర్టు, వినయ్‌ రాయ్‌ క్యారవాన్‌, అలాగే తన ఇంట్రో ఎపిసోడ్‌లో వచ్చే బ్యాంకు.. ఇవన్నీ సెట్లే. అయితే వీటన్నింటిలో నాకు సవాల్‌గా అనిపించింది హనుమంతుల వారి రక్త బిందువుతో ఏర్పడ్డ రుధిరమణిని తయారు చేయడమే. దీన్ని సహజంగా.. అందరూ నమ్మగలిగేలా రూపొందించడానికి రకరకాల ఆకారాల్లో దాదాపు వందకు పైగా మణుల్ని తయారు చేశాం. ఆఖరికి హనుమంతుల వారి రక్త బిందువుని రాముడి నామంలా పెట్టి.. దాని చుట్టూ ఓ శక్తిమంత మైన రక్షణ కవచం ఏర్పడ్డట్లుగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చి అలా చేశాం. అది బాగా వర్కవుట్‌ అయింది. నిజానికి ఈ మణిని రూపొందించే సరికి సినిమా 50శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. వినయ్‌ రాయ్‌ ఇంట్రో ఎపిసోడ్‌లో కనిపించే బ్యాంకు దోపిడీ సన్నివేశాల్ని బాంబేలో జరుగుతున్నట్లు చూపించాలంటే అక్కడికి వెళ్లి చిత్రీకరణ జరపడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అది మా వల్ల కాదు. దాని కోసం మేము తెలివిగా కొల్లూరు దగ్గరున్న ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్స్‌ను వాడుకున్నాం. వాటిని జాగ్రత్తగా ముంబయి సిటీ టైప్‌లో మేకోవర్‌ చేసి చిత్రీకరణ పూర్తి చేశాం. కానీ, ఆ సన్నివేశాలు తెరపై చూస్తున్నప్పుడు నిజంగా ముంబయిలో చిత్రీకరించినట్లే ఉంటాయి. ఇక ఈ చిత్ర క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలోని మహర్షి సెట్‌లో చేశాం. ఆ ఫైట్‌ చిత్రీకరణ చేస్తున్నప్పుడు పొగ కమ్ముకుంటుంది కదా దాన్ని అలా నిలిపి ఉంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీని కోసం ఆ మహర్షి సెట్‌ మొత్తాన్ని మాయా వాళ్ల సహకారంతో ఒక్కరోజులో ఫ్లోర్‌లో పునఃనిర్మించి చిత్రీకరణ పూర్తి చేశాం. ఒకరకంగా ఈ చిత్ర విషయంలో బడ్జెట్‌ పరిమితులు ఉండటం వల్లే ఏది కావాలో అది పర్‌ఫెక్ట్‌గా సమకూరిందనిపిస్తుంది’’.  

తిరుమల ఏడు కొండల స్ఫూర్తితో..

‘‘అంజనాద్రిలో కనిపించే పెద్ద హనుమంతుడి విగ్రహం పూర్తిగా గ్రాఫిక్సే. కాకపోతే అదెలా ఉండాలన్నది మేము బొమ్మలుగా వేసి.. మినియేచర్స్‌ చేసి గ్రాఫిక్స్‌ కంపెనీల వాళ్లకు ఇచ్చాం. తిరుపతి వెంకటేశ్వరస్వామి ఏడు కొండల్ని దూరం నుంచి చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి రూపం కనిపిస్తుంటుంది కదా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే ఆ హనుమాన్‌ విగ్రహాన్ని.. అంజనాద్రిని తీర్చిదిద్దుకున్నాం. నిజానికి ఇలాంటి సినిమాని ఎవరూ అనుకున్నది అనుకున్నట్లుగా చూపించలేరు. కానీ, దర్శకుడు ప్రశాంత్‌ తను అనుకున్నది అందరి నుంచి అనుకున్నట్లుగా సమర్థవంతంగా రాబట్టుకోగలిగాడు. ప్రస్తుతం మేము ‘జై హనుమాన్‌’ కోసం మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నాం. ప్రస్తుతం ‘ఈగల్‌’కు పని చేశా. అలాగే నాగచైతన్యతో ‘తండేల్‌’ కోసం పని చేస్తున్నా. ఆర్ట్‌ వర్క్‌కు ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమిది. ఈ సినిమా కోసం గోకర్ణలో మత్స్యకారుల గ్రామాన్ని నిర్మించాం. త్వరలో పాకిస్తాన్‌ నేపథ్యంలో ఓ జైలును నిర్మించనున్నాం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని