Cinema News: నా బెడ్‌ రూమ్‌లో దెయ్యం కనిపించేది

హారర్‌ థ్రిల్లర్స్‌లో ‘ఇన్స్‌పెక్టర్‌ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్‌ అవుతుందన్నారు నవీన్‌చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్‌ దర్శకత్వంలో రూపొందిన సిరీస్‌ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్‌, మాలినీ జీవరత్నం, కుమార్‌ వేల్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 28 Mar 2024 12:34 IST

హారర్‌ థ్రిల్లర్స్‌లో ‘ఇన్స్‌పెక్టర్‌ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్‌ అవుతుందన్నారు నవీన్‌చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్‌ దర్శకత్వంలో రూపొందిన సిరీస్‌ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్‌, మాలినీ జీవరత్నం, కుమార్‌ వేల్‌ కీలక పాత్రలు పోషించారు. సుఖ్‌దేవ్‌ లాహిరి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 29 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. నవీన్‌ చంద్ర మాట్లాడుతూ ‘‘నేను హారర్‌ కథ చేసి చాలా రోజులవుతోంది. ఈ కథ విన్నప్పుడు హారర్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉండటంతో ఈ సిరీస్‌ ఎందుకు చేయకూడదని వెంటనే దూకేశా. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. కథలోనే కాదు, నా పాత్రలోనూ పలు పార్శ్వాలుంటాయి. ఈ సిరీస్‌ కోసం దాదాపు వంద రోజులు పనిచేశా. రోజూ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికొచ్చాక నా బెడ్‌ రూమ్‌లో దెయ్యం కనిపించినట్టు అనిపించేది. నాకూ, దెయ్యానికీ చాలా సన్నివేశాలు ఉంటాయి సినిమాలో. పది ఎపిసోడ్స్‌గా రాబోతున్న ఈ సిరీస్‌ అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు. కథానాయిక సునయన మాట్లాడుతూ ‘‘ఇందులో ఫారెస్ట్‌ రేంజర్‌గా కనిపిస్తా. అన్నీ కుదిరిన కథ ఇది’’ అన్నారు. దర్శకురాలు నందిని జేఎస్‌ మాట్లాడుతూ ‘‘మొదట ఈ సిరీస్‌ని తమిళంలోనే చేద్దామనుకున్నా. కానీ పూర్తయ్యాక అన్ని భాషల్లోనూ చూడాల్సిన సిరీస్‌ అని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నా రవి, శ్రీకృష్ణ దయాళ్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రేమ పయనం

డార్లింగ్‌ కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ మాక్‌టైల్‌ 2’. మిలన నాగరాజ్‌, అమృత అయ్యంగర్‌, రేచల్‌ డేవిడ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్‌ పతాకంపై ఎం.వి.ఆర్‌.కృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎవరితో పయనం...’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. గురుచరణ్‌ సాహిత్యం సమకూర్చగా, యోగి సురేష్‌ ఆలపించారు. నకుల్‌ అభయాంకర్‌ సంగీతం సమకూర్చారు. ‘‘కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రమిది. ప్రేమ, వినోదం మేళవింపుగా రూపొందింది. ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌ ఆవిష్కరణతోపాటు, చిత్రం విడుదల తేదీనీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత ఎం.వి.ఆర్‌.కృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని