C Kalyan: బాలకృష్ణతో అంతర్జాతీయ స్థాయి సినిమా

‘‘ఇటీవల చిత్రీకరణలు ఆపేసి.. నిర్మాతలు చర్చించుకోవడమన్నది ఓ ఫ్లాప్‌ షో. దీని వల్ల సమయం, డబ్బు వృథా తప్పితే ఎలాంటి మేలు జరగలేద’’న్నారు ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌.

Updated : 09 Dec 2022 06:55 IST

‘‘ఇటీవల చిత్రీకరణలు ఆపేసి.. నిర్మాతలు చర్చించుకోవడమన్నది ఓ ఫ్లాప్‌ షో. దీని వల్ల సమయం, డబ్బు వృథా తప్పితే ఎలాంటి మేలు జరగలేద’’న్నారు ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ (C Kalyan). శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. 

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?
‘‘బాలకృష్ణతో (Balakrishna) ‘రామానుజాచార్య’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి చినజీయర్‌ స్వామి సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. కల్యాణ్‌ అమ్యుస్మెంట్‌ పార్క్‌ ఆరంభోత్సవం రోజున దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం’’.

కల్యాణ్‌ అమ్యుస్మెంట్‌ పార్క్‌ విశేషాలేంటి?
‘‘తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో దీన్ని నిర్మిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన వినోదం, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు.. అన్నీ ఇందులో ఉంటాయి. దాదాపు రూ.200కోట్ల ప్రాజెక్ట్‌ ఇది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నేను చేయడం దేవుడిచ్చిన వరంలా భావిస్తా’’.

చిత్రీకరణలు ఆపేసి నిర్మాతలు చర్చలు జరపడం వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా?
‘‘అదొక ఫ్లాప్‌ షో. కొందరి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్‌ అది. చిన్న సినిమా నిర్మాతల సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందని దానికి సమ్మతించాను. తొలి నాలుగు మీటింగుల్లోనే దాని వల్ల ఏం జరగదని అర్థమైపోయింది. కొన్ని లోపాలు, సమస్యలు గుర్తించారు కానీ, వాటి అమలు జరగలేదు. చిత్ర పరిశ్రమ బతికుందంటే అది కొత్తగా వచ్చే రెండు వందల మంది నిర్మాతల వల్లనే అని భావిస్తా’’.

సంక్రాంతి చిత్రాలపై కౌన్సిల్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు?
‘‘చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల నిర్మాతలు ఫిర్యాదు చేయకుండానే ఈ విషయంలో కౌన్సిల్‌ మాట్లాడటం వందశాతం తప్పు. ఆ సంగతి వాళ్లకీ చెప్పాను. కీడు చేసే గుణం ఉన్న వాళ్లు ఎంత పెద్ద హిట్లు కొట్టినా.. చివరికి జీరోలుగానే పరిశ్రమ నుంచి వెళ్లారు తప్ప ఎవరూ హీరోలుగా వెళ్లలేదు. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో నిలబడ్డాం. ఆ పరిశ్రమకు ఉపయోగపడమని నా మనవి’’.


‘‘గిల్డ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. దిల్‌రాజుతోనే (DilRaju) ఈ మాట చెప్పా. దాని వల్ల పరిశ్రమకు ఒరిగేదేం ఉండదు. దేనికైనా ఫిల్మ్‌ ఛాంబరే ముఖ్యం. గిల్డ్‌ అధ్యక్షుడిగా దిల్‌రాజు ఇండస్ట్రీకి పనికొచ్చే నిర్ణయం ఏరోజూ తీసుకోలేదు. ‘వారసుడు’ (Vaarasudu) విషయంలో ఆయన రెండు నాల్కల ధోరణి అవలంభించడం వల్లే పంపిణీదారులు, ప్రదర్శనకారులకు శత్రువుగా మారారు’’.


‘‘గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు మించిన వేడుకల్ని ఇక్కడా నిర్వహించాలన్న ఆదరణ ఉంది. దక్షిణాది సినిమాలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఏడాది నుంచి అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. దీన్ని ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సహకారంతో వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని