NTR: ఎన్టీఆర్ జీవితం పారితోషికాలకు అతీతం
మహానుభావుడు నందమూరి తారకరామారావుగారితో కలసి నేను వేసిన తొలి అడుగులు...ఒక్కొక్కటి తలుచుకుంటుంటే కళ్లు ఒక్కసారిగా చెమరుస్తాయి.
మహానుభావుడు నందమూరి తారకరామారావుగారితో కలసి నేను వేసిన తొలి అడుగులు...ఒక్కొక్కటి తలుచుకుంటుంటే కళ్లు ఒక్కసారిగా చెమరుస్తాయి. ఎందుకంటే ప్రతి అడుగులో నేను ఊహించని ప్రపంచాన్ని ఆయనలో దర్శించాను. జరిగిన ప్రతి సంఘటనా నా జీవితం నిండా వెలుగులు నింపిన ఒక ప్రభాతమే..సుప్రభాతమే.
ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించి తీరాలన్న పట్టుదలతోనే నేను భీష్మించుకుని కూర్చున్నాను...ఆయనకి నేను ఈ సినిమా సుడిగుండంలో చిక్కుకోవడం బొత్తిగా ఇష్టంలేని విషయం. కానీ నాకు ఆయన పట్ల ఉన్న ఆచంచలమైన ఆరాధనను చూసి కాదనలేకపోయారు. ఆయనతో నా తొలి సినిమా పేరే ‘ఎదురులేని మనిషి’. ఆ ప్రాజెక్ట్ ప్రకటించిన క్షణం నుంచే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.
నా అభిమాన కథానాయకుడు సరసన ఎవరిని కథానాయకిగా ఎంచుకోవాలన్న విషయంలోనే ఎడతెగని ఉత్కంఠ. నా మనసులో వాణిశ్రీ గారినే పెద్దాయన పక్కన పెట్టాలనే ఆలోచన గట్టిగా ఉంది. హై డిమాండ్లో ఉన్నారు ఆవిడ... ఎక్కువ డిమాండ్ చెయ్యొచ్చు...అవసరమా...పెద్దాయనే హీరో అయినప్పుడు హీరోయిన్ ఎవరైతే ఏంటని ఓ ధీమా అందరిలో...కానీ నేను మాత్రం ఏది ఏమైనా సరే వాణిశ్రీ గారైతేనే పర్ఫెక్ట్ అని...ఆవిడని కలిశాను. కథ, క్యారెక్టర్ గురించి చర్చ జరిగింది. ఫాన్సీ రెమ్యునిరేషన్ అడిగారు. నేను పెద్దగా ఆలోచించలేదు.. మారు మాట లేకుండా అగ్రిమెంట్ చేసేసాను.
రామారావుగారికి ఒక మొత్తం అనుకుని ముందే కొంత అధిక మొత్తం అందజేశాను. మరికొంత బ్యాలన్స్ ఇవ్వాలి. ఓ రోజు డబ్బు సిద్ధం చేసుకుని పెద్దాయనను కలవడానికి వెళ్లాను. వాణిశ్రీ గారికి ఇంత ఇస్తున్నాం కాబట్టి, మరి పెద్దాయనకి కూడా అంత కన్నా ఎక్కువ ఇవ్వాలనే ఒక మొత్తం తీసుకెళ్లి ఆయన చేతికి అందించాను. ఆయన ఆ కట్ట పట్టుకోగానే...కనుబొమ్మలు ఎత్తి ‘‘ఏమిటింత బరువు ఉంది’’ అన్నారు. మంచి అమౌంట్ పెద్దాయన గౌరవానికి తగినట్టుగా ఇవ్వగలుగుతున్నాం అనే గొప్ప అనుభూతి నాలో. ఆయన ప్యాకెట్ విప్పి చూసి లెక్కపెట్టారు. మళ్లీ నా వైపు చూసి నవ్వారు. ‘‘ఏం ఇంత తెచ్చారు...మాకు ముందే ఇచ్చారు కదా...మీరు నాకు ఇవ్వాల్సింది ఇప్పుడు ఇంతే...మిగిలింది మీరు తీసుకోండి’’ అని నా చేతిలో పెట్టారు. నేను అవాక్కయిపోయాను. ఏంటీ మహానుభావుడు... ఏంటీ వితరణ...అంతా ఆయన తీసుకోవాలనే నేనే తీసుకెళ్లాను. ఆ నిమిషంలో నా ఆలోచనలు స్తంభించిపోయాయి. ఆయన డబ్బు మనిషి కాదు...పరిపూర్ణమైన కళాకారుడు...స్వచ్ఛమైన కళాజీవి...తన పారితోషికాన్ని మించి ఒక్క పైసా కూడా ఎప్పుడూ ఆశించరు అన్న వాస్తవాన్ని గ్రహించిన నాకు ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఇదే కాదు...నా తోటి వాళ్లు ఇచ్చిన పారితోషికం గానీ, హిట్ అయిన సినిమాలకు పంపిణీదారులు తెచ్చి ఇచ్చే డబ్బులుగానీ ఆయన తన దగ్గర ఉంచుకునేవారు కాదు. తదుపరి చేయబోయే సినిమాలకు బుక్ చేసుకునే నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ వాళ్లు ఆ సమయంలో ఏం తీసుకుంటున్నారో దాని ప్రకారమే మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేసేవారు. సినిమా పరిశ్రమ తనకు ఇచ్చిన ప్రతీ రూపాయిని మళ్లీ చిత్ర పరిశ్రమకే వెచ్చించేవారు. సంపాదనని రియల్ ఎస్టేట్ మీద పెట్టడం, మరో రకమైన వ్యాపారాలకు మళ్లించడం ఎన్టీఆర్ ఏనాడూ చేయలేదు. ఆయనకున్న క్రేజ్ ప్రకారం పారితోషికాన్ని డిమాండ్ చెయ్యడమన్నది ఆయన చరిత్రలో ఏ పేజీలోను చూడలేం. చదవలేం.
నా జీవితంలో ఆ వెండితెర వెంకటేశ్వరుడితో నా తొలి భారీ సినిమా చెయ్యడమే మహద్భాగ్యం అనుకుంటే, ఆయన అంతరంగిక జీవితంలోకి అతి దగ్గరగా తొంగి చూసే సుకృతం కూడా నాకు కలిగింది. ఆయనే నా మీద ప్రేమతో, పుత్ర వాత్సల్యంతో ఆ అపురూపమైన స్థానాన్ని నాకు కలిగించారని చెప్పాలనిపించే మధురమైన క్షణాలివి. ఆయనతో గడిపిన ప్రతి క్షణం స్వర్గతుల్యం. అమృతప్రాయం.
అశ్వనీదత్ చలసాని, ప్రముఖ సినీ నిర్మాత
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు
-
YV Subbareddy: ఏ హోదాలో వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం?
-
విలాస హోటల్‌గా చర్చిల్ పాత యుద్ధ కార్యాలయం