బిగ్‌బాస్‌ 4: ఈసారి 10 వారాలేనా?

బిగ్‌బాస్‌..తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ షో నాలుగో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Updated : 08 Aug 2020 11:59 IST

హైదరాబాద్: తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘బిగ్‌బాస్’‌ షో నాలుగో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఎవరెవరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తారు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఈసారి బిగ్‌బాస్‌ ఎన్ని రోజులు నిర్వహిస్తారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. కొందరేమో 50 రోజులని, ఇంకొందరేమో ఎప్పటిలాగే 100 రోజులని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో వాదన వినిపిస్తోంది. 

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను 10 వారాలకు కుదించాలని నిర్వాహకులు భావిస్తున్నారని భోగట్టా. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈసారి షోలో ఆలింగనాలు, దగ్గరికి తీసుకోవడాలు, కరచాలన చేసుకోవడాలు లాంటివి కనిపించకపోవచ్చని అంటున్నారు. అలాగే కంటెస్టెంట్లు భౌతిక దూరం పాటించే విధంగా టాస్కులు ఉండొచ్చని తెలుస్తుంది. ఫన్నీ టాస్క్‌లతో వీక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందట. కంటెస్టెంట్లకు ఇచ్చే పారితోషికంలో కోత ఉంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు దీనిలో పాల్గొనే 16 మందిని క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెబుతున్నారు. 

ఇటీవల సీజన్‌-4కు సంబంధించిన ప్రచార చిత్రాల షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత నాగార్జున మేకప్‌ వేసుకున్నారు. సెట్స్‌లోని స్టిల్స్‌ను పంచుకున్నారు. ‘‘తిరిగి షూటింగ్‌కు వచ్చేశా. లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ఏం అద్భుతం... నిజంగా అద్భుతమే’’ అని ట్వీట్‌ చేశారు. పీపీఈ కిట్లు ధరించి ఉన్న మేకప్‌ మెన్‌లు ఆయనను ప్రచార చిత్రాల షూటింగ్‌ కోసం సిద్ధం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని