oscars 2023: దీపికా పదుకొణెపై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్

ఆస్కార్‌ వేదికపై దీపికా పదుకొణె (Deepika Padukone) ఎంతో హుందాగా ఉందని కంగనా రనౌత్‌ (Kangana Ranaut ) పేర్కొంది. అలా ఉండడం అంత సులభం కాదంటూ దీపికా పదుకొణెపై ప్రశంసలు కురిపించింది. 

Published : 13 Mar 2023 16:58 IST

హైదరాబాద్‌ : 95వ ఆస్కార్‌ అవార్డుల వేదికపై దీపికా పదుకొణె (Deepika Padukone) ఇచ్చిన స్పీచ్‌పై బాలీవుడ్‌  హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut ) ప్రశంసలు కురిపించింది. వేడుకకు వచ్చిన ప్రముఖులకు ‘నాటు నాటు’ పాటను దీపిక పరిచయం చేసిన తీరు ఆకట్టుకుందని కంగనా ట్వీట్‌ చేసింది. ఎంతో స్ఫూర్తిమంతంగా ఉందంటూ ఆమెపై పొగడ్తలు కురిపించింది.
‘‘దీపికా.. ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదికపై(oscars 2023) నిల్చొని.. అందంగా చిరునవ్వుతో మాట్లాడడం అంత సులభం కాదు. అలాంటిది మీరు ‘నాటు నాటు’ పాటను పరిచయం చేసిన తీరు నిజంగా ప్రశంసనీయంగా ఉంది. భారతదేశ మహిళలు అత్యుత్తమమైన వారు అనడానికి మీరు నిలువెత్తు నిదర్శనం . దేశ ప్రతిష్ఠను మీ భుజాన మోస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యతగా వ్యవహరించారు’’ అని కంగనా ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణమైన క్షణాలు..’’అని పేర్కొంటున్నారు. ఆస్కార్‌ వేడుకలో తొలి రౌండ్‌ ప్రజెంటర్లలో ఒకరుగా దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు హాజరైన వారంతా చప్పట్లు కొడుతుండగా.. దీపికా పదుకొణె మధ్య మధ్యలో ఆగుతూ చిరునవ్వుతో తన స్పీచ్‌ను కొనసాగించింది. ‘‘నాటు నాటు గురించి మీకు తెలుసా..?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం నుంచి ‘నాటు నాటు’ ఇదే.. అంటూ పాటను పరిచయం చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని