Updated : 14 Aug 2022 07:43 IST

Tollywood: ‘అల్లూరి’ విచ్చేస్తున్నాడు

శ్రీవిష్ణు (SreeVishnu) హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల్లూరి’ (Alluri). నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. తనికెళ్ల భరణి, మధుసూధన్‌రావు, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా  సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త లుక్‌ను నెట్టింట పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో శ్రీవిష్ణు చేతిలో బల్లెం పట్టుకుని సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ‘‘ఇదొక చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో శ్రీవిష్ణు నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.


సందేశమిచ్చే ‘మెకానిక్‌’

మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌’ (mechanic). ట్రబుల్‌ షూటర్‌.. అన్నది ఉపశీర్షిక. ముని సహేకర దర్శకుడు. ఎమ్‌.నాగమున్నెయ్య, కొండ్రాసి ఉపేందర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. సందేశాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇందులో అన్ని రకాల వాణిజ్య హంగులు పుష్కలంగా ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, నాగ మహేష్‌, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: వినోద్‌ యాజమాన్య, ఛాయాగ్రహణం: ఎస్‌.వి.శివరాం.


భళా చోర.. భళా

ఖయ్యూమ్‌, నవీన్‌ నేని, రోయిల్‌ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భళా చోర భళా’ (Bhala Chora Bhala). ఎ.ప్రదీప్‌ తెరకెక్కించారు. ఎ.జనని ప్రదీప్‌ నిర్మించారు. శాంతి దేవగుడి, చింటూ, రామ్‌ జగన్‌, చిత్రం శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు ఖయ్యూమ్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ టైమ్‌లో ప్రదీప్‌ నాకు కథ చెప్పారు. వినగానే బాగా నచ్చి.. చేస్తానన్నా. 9రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి.. రెండు నెలల్లో నిర్మాణాంతర పనులు ముగించి విడుదలకు సిద్ధం చేశాం. మంచి చిత్రమిది. దీన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో నేనూ ఓ పాత్ర చేశా. అందరికీ మా ప్రయత్నం నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్‌ అద్దంకి, ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌.


ప్రేమకథ

సతీష్‌ మేరుగు కథానాయకుడిగా  నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏయ్‌ బుజ్జి నీకు నేనే’ (Ye Bujji Niku Nene). హృతికాసింగ్‌ కథానాయిక. విడుదలకి సిద్ధమైన ఈ సినిమా గీతావిష్కరణ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాలకి మద్దతిస్తే పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని మంచి సినిమాలు రూపొందే అవకాశం ఉంటుంది. ప్రచార చిత్రాల్ని చూస్తుంటే మంచి కథతో రూపొందినట్టు స్పష్టమవుతోంది’’ అన్నారు. సతీష్‌ మేరుగు మాట్లాడుతూ ‘‘మంచి ప్రేమకథతోపాటు... వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ    కార్యక్రమంలో కృష్ణమూర్తి, రామిరెడ్డి, ప్రేమ్‌కుమార్‌, కుప్పిలి శ్రీనివాస్‌, దేవా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని