2018 Movie: భారత్‌ నుంచి ఆస్కార్‌ అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘2018’!

2018 Movie:  ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ ‘2018’ను ఎంపిక చేసింది.

Updated : 27 Sep 2023 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’ (2018 movie) అధికారికంగా ఎంపికైనట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల సినీ ప్రేక్షకులతోనూ కన్నీళ్లు పెట్టించింది. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఏటా వివిధ దేశాలు ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరిలో తమ చిత్రాలను అకాడమీకి పంపుతాయి. ఈ క్రమంలో ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడ్డాయి. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సినిమాలను వీక్షించింది. మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించి, చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం ‘2018’ సినిమాను కమిటీ ఎంపిక చేసింది. ఆమిర్‌ఖాన్‌ ‘లాగాన్‌’ తర్వాత ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో తుది వరకూ నిలవలేదు. అంతకుముందు ‘మదర్‌ఇండియా’, ‘సలామ్‌ బాంబే’ చిత్రాలను మాత్రమే ఈ కేటగిరిలో పోటీ పడ్డాయి.

2018 movie telugu review: రివ్యూ: 2018

ఇక ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘RRR’ ఈ ఏడాది రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది భారత్‌ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను పంపగా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మరోవైపు ‘ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌కు అవార్డు వచ్చింది. ప్రస్తుతం 2018 మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్‌’లో మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని