Mrunal Thakur: కోస్టార్స్‌పై మృణాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాని గురించి ఏమన్నారంటే!

తన కోస్టార్స్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. ఈ సందర్భంగా నాని, దుల్కర్‌ సల్మాన్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Aug 2023 15:10 IST

హైదరాబాద్‌: ‘సీతారామం’తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).  ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కో-స్టార్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఇప్పటివరకు నటించిన కోస్టార్స్‌ అందరూ తనకు మంచి స్నేహితులని మృణాల్‌ చెప్పారు. వాళ్లందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు. వాళ్లు తనకు మార్గదర్శకులతో సమానమన్నారు. ‘సీతారామం’లో తనతో నటించిన దుల్కర్‌ గురించి మాట్లాడుతూ..  ‘‘దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. తనను చూసి ఒక డైలాగును వివిధ భాషల్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. డైలాగ్‌ల విషయంలో భయం పోయింది. ఆయన అన్నింటిలో సూపర్ స్టార్‌ అని నా అభిప్రాయం. ఇక నాని (Nani) ఎంతో నాచురల్‌గా ఉంటాడు. ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండాల్సిన పనిలేదని ఆయన నాకు చెప్పారు. అయితే మన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ స్మార్ట్‌గా ఉండాలని నాని సూచించారు’’ అంటూ మృణాల్‌ చెప్పారు.

 గౌతమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది..: కుమారుడిపై నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌

ఈ సందర్భంగా ‘సీతారామం’తో తనకు మంచి విజయాన్ని అందించిన హను రాఘవపూడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాకు తెలుగు రాకపోయినా.. హను రాఘవపూడి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించారు. నేను ఎలాంటి పాత్రల్లోనైనా చేయగలనని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే నాకు గొప్ప ప్రశంస. ప్రస్తుతం దర్శకనిర్మాతలు ఎంతో మంచి పాత్రలు ఇస్తున్నారు. అందరి ఆదరాభిమానాలు చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని మృణాల్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె 5 సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో నాని సరసన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna)లో కనిపించనున్నారు. ఇది డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ (#VD13) మృణాల్‌ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని