Nagarjuna: 3 నెలల్లో సినిమా ఎలా తీయొచ్చో పుస్తకం రాసిస్తాం

‘‘పండగ రోజున సినిమాలు చూడటం మనకు ఆనవాయితీ. నాలుగు సినిమాలొచ్చినా చూస్తారు. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని చిత్రాలూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’.

Updated : 11 Jan 2024 09:29 IST

‘నా సామిరంగ’ వేడుకలో నాగార్జున

‘‘పండగ రోజున సినిమాలు చూడటం మనకు ఆనవాయితీ. నాలుగు సినిమాలొచ్చినా చూస్తారు. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని చిత్రాలూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, రుక్సార్‌ థిల్లాన్‌, మిర్నా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. పవన్‌కుమార్‌ సమర్పకులు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘ఈసారి పండగ సినిమాలన్నీ ప్రేక్షకుల మెప్పు పొందాలి. మేం ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మా సినిమాకి స్టార్‌ కీరవాణి గారు. ఆయన ఇచ్చిన పాటలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. మూడు నెలల్లో పూర్తి చేశామంటే ఆయన, చంద్రబోస్‌ మా వెనకాల ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించడమే కారణం. వీళ్లిద్దరూ సామాన్యులు కాదు. తెలుగు సినిమా పరిశ్రమని తీసుకెళ్లి ఆస్కార్‌ వేదికపై నిలబెట్టారు. మూడు నెలల్లో సినిమా చేయడం అంత సులభం కాదు. మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చో ఒక పుస్తకం రాసిస్తాం. ఈసారి పండగకి కిష్టయ్య వస్తున్నాడు, బాక్సాఫీస్‌ కొడుతున్నాడు’’ అన్నారు. విజయ్‌ బిన్నీ మాట్లాడుతూ ‘‘నా జీవితం మొత్తానికి చాలా ముఖ్యమైన మనిషి నాగార్జున సర్‌. ఇలాంటి చిత్రాలు ఆడితే,  నాలాగే మరో పది మంది దర్శకుల్ని నాగార్జున సర్‌ పరిచయం చేస్తార’’న్నారు. చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘28 ఏళ్లుగా నన్ను, నా ప్రతిభని ప్రోత్సహిస్తూ తనతోపాటు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కీరవాణి సర్‌. ఆయనకు పాదాభివందనాలు’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ‘‘రామ్‌గోపాల్‌ వర్మ మొదలుకొని విజయ్‌ బిన్నీ వరకూ కొత్త దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంటూ వాళ్లకి జీవితాన్నిస్తున్న కథానాయకుడు నాగార్జున. ఇకపైన సంగీత్‌ వేడుకలన్నీ మా ‘దుమ్ము దుకాణం...’ వేడుకలు అవుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, రుక్సార్‌ థిల్లాన్‌, మిర్నా మేనన్‌, శ్రీనివాసా చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని