Nitin desai: ఇక నాకు నడిచే ఓపిక లేదు: ఆత్మహత్యకు ముందు నితిన్‌ ఆవేదన

ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ (Nitin Chandrakant Desai) ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. తన బాధను తెలియజేస్తూ కొన్ని ఆడియో క్లిప్స్‌ రికార్డ్‌ చేశారు. అప్పుల బాధను తాను తట్టుకోలేకపోతున్నానన్నారు.

Published : 04 Aug 2023 16:30 IST

ముంబయి: రుణ బాధలు తట్టుకోలేక బాలీవుడ్‌ ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ (Nitin Chandrakant Desai) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నితిన్‌ దేశాయ్‌ సూసైడ్‌ కేసును దర్యాప్తు చేస్తోన్న రాయ్‌గఢ్‌ పోలీసులు మీడియాతో మాట్లాడారు. నితిన్‌కు చెందిన ఎన్డీ ఆర్ట్స్ స్టూడియో నుంచి ఓ ఆడియో రికార్డర్‌ స్వాధీనం చేసుకున్నామని.. అందులో దాదాపు 11 ఆడియో క్లిప్స్‌ ఉన్నాయన్నారు.

‘‘దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఓ ఆడియో క్లిప్‌లో నితిన్‌ తన ఆవేదనను వెళ్లగక్కారు. అప్పుల భారాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘ఇప్పటికే ఎంతో దూరం వచ్చా. ఇక, నడిచే ఓపిక నాకు లేదు’’ అని బాధపడ్డారు. ఫైనాన్స్‌ సంస్థ విధానాల కారణంగా తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని.. వాటి నుంచి బయట పడలేకపోతున్నానన్నారు. అలాగే, తాను ఫైనాన్స్‌ తీసుకున్న సంస్థలోని నలుగురు వ్యక్తుల గురించి నితిన్‌ ఎక్కువగా మాట్లాడారు. త్వరలోనే ఆ నలుగురు వ్యక్తులను విచారిస్తాం’’ అని పోలీస్‌ అధికారులు తెలిపారు. మరికొన్ని ఆడియో క్లిప్స్‌లో నితిన్‌.. తన లైఫ్‌స్టోరీని చెప్పారన్నారు.

రామ్ చరణ్‌ను నా సొంత కుమారుడిలా భావిస్తా: సముద్రఖని

నితిన్‌కు ఇప్పటివరకూ దాదాపు రూ.252 కోట్ల అప్పు ఉన్నట్లు సమాచారం. సీఎఫ్‌ఎం అనే ఫైనాన్స్‌ సంస్థ నుంచి 2016, 2018 సంవత్సరాల్లో రెండు దఫాలుగా రూ.180 కోట్లను ఆయన తీసుకున్నారు. ఈ అప్పు కోసం 42 ఎకరాల స్థలాన్ని, ఇతర ఆస్తులను ఆయన తనఖా పెట్టారు. అప్పు చెల్లించడంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో, సదరు ఫైనాన్స్‌ సంస్థ నితిన్‌ నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యతను Edelweiss Asset Reconstruction అనే సంస్థకు అప్పగించింది. ఈ క్రమంలో ఎడెల్విస్‌ సంస్థ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు రుణ రికవరీ ప్రక్రియను అంగీకరించింది. ఈ క్రమంలోనే నితిన్‌ ఆగస్టు 2న కర్జాత్‌లోని తన స్టూడియోలో సూసైడ్‌ చేసుకున్నారు.

ఉత్తమ కళా దర్శకుడిగా నాలుగు జాతీయ అవార్డులను నితిన్‌ దేశాయ్‌ అందుకున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లకు ఆయన ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘లగాన్‌’, ‘హమ్‌ దిల్‌దే చుకే సనమ్‌’, ‘జోధా అక్బర్‌’, ‘ప్రేమ్‌ రథన్‌ ధన్‌ పాయో’ వంటి సినిమాలకు నితినే ఆర్ట్‌ డైరెక్టర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని