
Prabhas Radhe shyam: ‘రాధేశ్యామ్’ రాక అప్పుడే!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బ, థియేటర్ల సమస్యలతో నిర్మాతలు తమ సినిమాలను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ‘లవ్‌స్టోరి’తో థియేటర్లలోకి వచ్చే టాలీవుడ్ సినీప్రియుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చే సంక్రాంతికి పరిస్థితులు మరింత కుదుటపడతాయనే ఉద్దేశంతో బడా హీరోలు పండగ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాలు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలే అది పాన్ ఇండియా చిత్రం. భారీ స్థాయిలో విడుదలకు ప్రణాళికలు వేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రాకపై సందిగ్ధం ఏర్పడింది. ఆ సినిమా నిర్మాతలు విడుదల తేదీలో మార్పులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్రబృందం మరోసారి ‘రాధేశ్యామ్’ విడుదలపై క్లారిటీ ఇచ్చింది. వాయిదా పడుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తాజాగా ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే సినిమా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఇది వరకు ప్రకటించినట్లుగా వచ్చే జనవరి 14నే ‘రాధేశ్యామ్’ పలకరించనుందని స్పష్టమైంది. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాలతో సంక్రాంతి పోటీ వేడెక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా అదే సమయానికి వస్తే పోటీ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. సంక్రాంతికి స్టార్ హీరోలు రావడం సందడిగానే అనిపించినా, నాలుగు బడా చిత్రాలు ఒకేసారి వస్తే కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని సినీ పెద్దలు హెచ్చరిస్తున్నారు.