siima awards 2023: ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌... ఉత్తమ చిత్రం ‘సీతారామం’

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటనకిగానూ ఉత్తమ నటుడిగా సైమాలో పురస్కారం సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘ధమాకా’లో నటనకిగానూ శ్రీలీల ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు.

Updated : 17 Sep 2023 13:55 IST

సైమాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి పురస్కారాల పంట

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటనకిగానూ ఉత్తమ నటుడిగా సైమాలో పురస్కారం సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘ధమాకా’లో నటనకిగానూ శ్రీలీల ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘సీతారామం’ విజేతగా నిలిచింది. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు దుబాయ్‌లో అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకి, శనివారం తమిళ, మలయాళ పరిశ్రమలకి పురస్కారాల్ని ప్రధానం చేశారు. తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణి, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌, ఉత్తమ ఛాయాగ్రాహకుడుగా సెంథిల్‌లకి పురస్కారాలు దక్కాయి. క్రిటిక్స్‌ మెచ్చిన ఉత్తమ నటుడిగా అడివి శేష్‌ (మేజర్‌), ‘సీతారామం’లో నటనకిగానూ క్రిటిక్స్‌ మెచ్చిన ఉత్తమ నటిగా, ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ నిలిచారు. ‘హీరో’ సినిమాకిగానూ ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా అశోక్‌ గల్లా పురస్కారం అందుకున్నారు.

ఉత్తమ సహాయనటుడిగా రానా దగ్గుబాటి (భీమ్లానాయక్‌) విజేతగా నిలిచారు. ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌గా శ్రుతి హాసన్‌ పురస్కారం అందుకుంది. పలువురు నటులు, సాంకేతిక నిపుణులు వేదికపై పురస్కారాల్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘నాపైన నమ్మకంతో కొమురం భీమ్‌లాంటి గొప్ప పాత్రనిచ్చిన నా జక్కన్న రాజమౌళికి ధన్యవాదాలు. నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నా. నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడిన ప్రతిసారీ వాళ్లు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడంతా సంతోషపడ్డారు. ఈ పురస్కారం అందించిన సైమాకి కృతజ్ఞతలు’’ అన్నారు. సైమా వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్‌ ఇందూరి, ఆయన భార్య బృందా ప్రసాద్‌ ఈ వేడుకలో పాల్గొన్న కళాకారులు, సాంకేతిక నిపుణులకి, విజేతలకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సి. అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌, హను రాఘవపూడి, డి.వి.వి. దానయ్య, ఖుష్బూ, నిఖిల్‌, మంచు లక్ష్మీ, చందూ మొండేటి,  సుధీర్‌బాబు, బెల్లంకొండ గణేశ్‌, సుహాస్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని