Custody: మనవైన భావోద్వేగాలు నిండిన... హాలీవుడ్‌ సినిమాలాంటిది

‘‘నాగార్జున కెరీర్‌లో ‘శివ’ సినిమాలా... నాగచైతన్య కెరీర్‌లో ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి.

Updated : 11 May 2023 14:06 IST

‘‘నాగార్జున కెరీర్‌లో ‘శివ’ సినిమాలా... నాగచైతన్య కెరీర్‌లో ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa chitturi). హిందీలోనూ ఈ సినిమాని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఆయన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘కస్టడీ’ (custody). నాగచైతన్య (Naga chaitanya), కృతిశెట్టి (krithi shetty) జంటగా నటించారు. వెంకట్‌ ప్రభు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘సినీ నిర్మాణంలో నాకు ఇరవయ్యేళ్ల అనుభవం ఉంది. నమ్మిన కథకి తగ్గట్టుగా ఖర్చు పెట్టి సినిమా తీయడమే మా శైలి. అలా ఈ సినిమాని కూడా నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో నిర్మించాం. ‘యూ టర్న్‌’ చేసేనాటికి సమంత మార్కెట్‌ ఏమిటో ఎవరికీ తెలియదు. కథ నచ్చి, దానికి  తగ్గట్టుగా ఖర్చు పెట్టి చేశాం. రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది. అప్పుడే నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నాం. వెంకట్‌ ప్రభుతో కూడా ‘గ్యాంబ్లర్‌’ నుంచే సినిమా చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాం. ‘కస్టడీ’ సినిమాతో ఈ కలయిక కుదిరింది. నిజాయతీగల ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కథ ఇది. యాక్షన్‌తోపాటు కుటుంబ నేపథ్యంలోని భావోద్వేగాలూ ఉంటాయి. కథ, మంచి స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి బలం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే భావోద్వేగాలు, వినోదంతో సీరియస్‌గా కథ సాగుతుంది. ఆ రెండిటినీ దర్శకుడు మేళవించిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగు భావోద్వేగాలతో ఓ హాలీవుడ్‌ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది’’.

‘‘1990ల్లో జరిగే కథ ఇది. రెండు భాషల్లో చేయాలనుకున్నాం. అనుకున్నట్టుగానే ఒకొక్క షాట్‌ని రెండు భాషల్లో తెరకెక్కించాం. సాంకేతికంగా రెండు సినిమాలు చేసినట్టే. ఇలాంటి కథలకి ఇళయరాజా నేపథ్య సంగీతం అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించాం. కథ వినగానే ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా చేయడానికి ముందుకొచ్చారు. కృతిశెట్టి అందమైన నటి, యువతరానికి ఇష్టమైన కథానాయిక. ఇందులో మంచి నటనని ప్రదర్శించారు. అరవింద్‌ స్వామి, శరత్‌కుమార్‌, ప్రియమణి పాత్రలు గుర్తుండిపోతాయి. ఒకవైపు అరవింద్‌స్వామి, మరోవైపు శరత్‌కుమార్‌... రెండు కొండల్లా కనిపించే ఆ పాత్రల మధ్య కథానాయకుడు చేసిన పోరాటం ఎలాంటిదనేది ఆసక్తికరం. కొన్ని సన్నివేశాల్లో తెలుగులో వెన్నెల కిశోర్‌, తమిళంలో ప్రేమ్‌జీ కనిపిస్తారు. ఇందులోని ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది’’.

‘‘ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర పేరు... శివ. ఈ సినిమాకి ‘శివ’ సరైన పేరు అనిపించింది. కానీ నాగచైతన్య ‘పోలికలు వస్తాయి, వద్దు’ అన్నారు. ఈ సినిమానే కాదు, ‘శివ’ సినిమాలో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో, అందులోని పాత్రలు కూడా అంతే ప్రభావం చూపిస్తాయి. అరవింద్‌ స్వామి ఈ కథ వినగానే మరో ఆలోచన లేకుండా చేస్తానని ముందుకొచ్చారు. నాలుగు కీలకమైన ఎపిసోడ్స్‌ ఈ సినిమాలో ఉంటాయి, అవన్నీ కూడా సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. నీళ్లలో సాగే సన్నివేశాలు తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటాయి. ఆ సన్నివేశాల్ని  మైసూర్‌, రాజమండ్రి తదితర ప్రదేశాల్లో రోజుకి రెండు షిఫ్టుల చొప్పున  20 రోజులుపైనే కష్టపడి చిత్రీకరించాం’’.  


‘‘నాగచైతన్యతో మరో రెండు సినిమాల్ని నిర్మించనున్నాం. ‘కస్టడీ’కి కొనసాగింపుగా  మరో చిత్రం ఉంటుంది. దాంతోపాటు  మరొక కొత్త చిత్రం చర్చల దశలో ఉంది. ప్రస్తుతం మా సంస్థలో రామ్‌ - బోయపాటి కలయికలో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న టీజర్‌ని విడుదల చేస్తాం. పేరు తర్వాత ప్రకటిస్తాం. నాగార్జున కథానాయకుడిగా ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్‌ ప్రథమార్ధం తర్వాత చిత్రీకరణ మొదలవుతుంది. దర్శకుడు, ఇతరత్రా వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని