K Vasu: ప్రముఖ దర్శక నిర్మాత కె.వాసు కన్నుమూత

‘ప్రాణం ఖరీదు’తో అగ్ర కథానాయకుడు  చిరంజీవిని తెరకు పరిచయం చేయడంతోపాటు... ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ సహా గుర్తుండిపోయే ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకనిర్మాత కె.వాసు (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Updated : 27 May 2023 12:28 IST

‘ప్రాణం ఖరీదు’తో అగ్ర కథానాయకుడు  చిరంజీవిని తెరకు పరిచయం చేయడంతోపాటు... ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ సహా గుర్తుండిపోయే ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకనిర్మాత కె.వాసు (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ తనయుడే కె.వాసు. ఆయన బాబాయ్‌ హేమాంబరధరరావు కూడా దర్శకుడే. 1951 జనవరి 7న హైదరాబాద్‌లో జన్మించిన కె.వాసు అసలు పేరు కొల్లి శ్రీనివాసరావు. ఆయనకి భార్య రత్నకుమారితోపాటు కుమార్తెలు అన్నపూర్ణ, దీప్తి ఉన్నారు. తండ్రి, బాబాయ్‌ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన... 22 ఏళ్ల వయసులోనే మెగాఫోన్‌ పట్టి ‘ఆడపిల్లల తండ్రి’ అనే సినిమాని స్వీయ నిర్మాణంలో  తెరకెక్కించారు. తొలి చిత్రమే శతదినోత్సవం చేసుకుంది. ఆయన ఆ తర్వాత ఆటుపోట్లు ఎదురైనా... ‘ప్రాణం ఖరీదు’, ‘ఏది పాపం ఏది పుణ్యం’ తదితర సినిమాల్ని తెరకెక్కించి విజయాల్ని అందుకున్నారు. ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి తొలి చిత్రమే ‘ప్రాణం ఖరీదు’.  కోట శ్రీనివాసరావు కూడా ఓ చిన్న పాత్రతో ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ముద్దు ముచ్చట’, ‘ఒక చల్లని రాత్రి’, ‘కోతల రాయుడు’, ‘దేవుడు మామయ్య’, ‘ఆరని మంటలు’, ఎన్టీఆర్‌తో ‘సరదా రాముడు’ చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘గోపాలరావు గారి అమ్మాయి’, ‘అమెరికా అల్లుడు’ చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. చిరంజీవితో మొత్తం ఐదు చిత్రాల్ని తెరకెక్కించారు కె.వాసు.

తెలుగులో  భక్తి  ప్రధానమైన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ దర్శకుడు ఆయనే. విజయచందర్‌ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ప్రముఖ  సంగీత దర్శకుడు చక్రవర్తి, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రధారులుగా ‘పక్కింటి అమ్మాయి’, కృష్ణంరాజు,  శ్రీదేవి కలయికలో ‘బాబులుగాడి దెబ్బ’, చంద్రమోహన్‌, సరిత కలయికలో వచ్చిన ‘కలహాల కాపురం’తోపాటు, ‘అల్లుళ్లొస్తున్నారు’, ‘ఆడపిల్ల’, ‘ప్రేమచిత్రం పెళ్లి విచిత్రం’, ‘రేపటి రౌడీ’, ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’, ‘జోకర్‌ మామ సూపర్‌ అల్లుడు’, ‘గజిబిజి’ సహా 40కిపైగా చిత్రాల్ని తెరకెక్కించారు. తన కెరీర్‌లో ఎక్కువ విజయాల్ని అందుకున్న కె.వాసు ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


సంతాపం

‘‘సీనియర్‌ దర్శకుడు వాసు ఇకలేరనే వార్త నన్ను చాలా బాధించింది. నా కెరీర్‌ తొలి రోజుల్లో చేసిన ‘ప్రాణం ఖరీదు’, ‘తోడుదొంగలు’, ‘అల్లుళ్లు వస్తున్నారు’, ‘కోతల రాయుడు’ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’’   

చిరంజీవి

‘‘వినోదాత్మక కథలే కాకుండా... భావోద్వేగ ప్రధానమైన అంశాలతోనూ సినిమాలు తెరకెక్కించారు కె.వాసు. ఆయన సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం ప్రత్యేకమైనది. తెలుగు నాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందడంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. అన్నయ్య చిరంజీవి ముఖ్యపాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా దర్శకులుగా వాసుని మరిచిపోలేం. వాసు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’’  

పవన్‌కల్యాణ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని