Shriya saran: ఇప్పటికీ రజనీకాంత్‌ సలహానే పాటిస్తున్నా

చిత్రపరిశ్రమలో మంచి నటీనటులుగా ఎదగాలంటే వారికున్న ప్రతిభ మాత్రమే కాదు ఇతరులు ఇచ్చే సలహాలు కూడా సహాయపడతాయి.

Updated : 25 Mar 2024 09:23 IST

చిత్రపరిశ్రమలో మంచి నటీనటులుగా ఎదగాలంటే వారికున్న ప్రతిభ మాత్రమే కాదు ఇతరులు ఇచ్చే సలహాలు కూడా సహాయపడతాయి. అలాంటి సలహాలతోనే తన సినీ జీవితంలో రాణిస్తున్నానని అంటోంది ప్రముఖ కథానాయిక శ్రియ. తెలుగు చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే అగ్రతారలతో నటించింది. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ మంచి గుర్తింపు తెచుకుంది. ఇటీవల ‘షో టైమ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె రజనీకాంత్‌ ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానంటూ తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘నటిగా నేను చిత్రసీమలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నాను. ఒకసారి భయపడి షూటింగ్‌ నుంచి కూడా పారిపోయాను. విక్రమ్‌తో ‘కందసామి’ సినిమా చేస్తున్న సమయంలో ఒక్క షాట్‌కి ఎన్నో టేకులు తీసుకునేదాన్ని. విక్రమ్‌ ఓపికగా భరించేవారు. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలా చేస్తే చిత్రీకరణపై, సెట్‌పై ప్రభావం చూపుతుందని నాకు అర్థమయ్యేలా ఆయన చెప్పిన మాట నన్ను నేను మార్చుకోవడానికి సహాయ పడింది. నేను రజనీకాంత్‌తో ‘శివాజీ’ చేస్తున్నప్పుడు ఆయన నాకు గొప్ప సలహా ఇచ్చారు. ‘ఈరోజు నువ్వు నీ అందం, అభినయంతో విజయవంతమైన సినిమాలు చేస్తున్నావు. వచ్చే రోజుల్లో పరిస్థితి మారవచ్చు. వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. అయినా ప్రేక్షకులతో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తించాలి’ అని ఆయన చెప్పిన సలహా ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ నేనదే పాటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రియ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని