Cinema News: నిలిచి.. గెలిచారు

సీనియర్‌ కథానాయికలు జోరు ప్రదర్శిస్తున్నారు. తమకి పోటీనే లేదని చాటుతూ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ మధ్యే వచ్చి హవా ప్రదర్శించిన యువ నాయికలు సైతం చేతుల్లో సరైన సినిమాలు లేక... కెరీర్‌ విషయంలో కంగారు పడుతుండగా, సీనియర్లు మాత్రం అదరగొడుతున్నారు.

Updated : 02 Jul 2023 14:12 IST

ఏళ్లు గడుస్తున్నా తగ్గని సీనియర్‌ నాయికల జోరు
యువ హీరోయన్లకు స్ఫూర్తి.. వీళ్ల దారి

సీనియర్‌ కథానాయికలు జోరు ప్రదర్శిస్తున్నారు. తమకి పోటీనే లేదని చాటుతూ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ మధ్యే వచ్చి హవా ప్రదర్శించిన యువ నాయికలు సైతం చేతుల్లో సరైన సినిమాలు లేక... కెరీర్‌ విషయంలో కంగారు పడుతుండగా, సీనియర్లు మాత్రం అదరగొడుతున్నారు.

కప్పుడు ఓ కథానాయిక పదేళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తోందంటే అదొక పెద్ద విశేషమే. వాళ్ల కెరీర్‌లు దాదాపు చరమాంకంలో ఉన్నట్టుగానే లెక్కగట్టేవాళ్లు. ఇక పెళ్లి  చేసుకున్నారంటే మాత్రం... కెరీర్‌ ముగిసినట్టే భావించేది చిత్రసీమ. కొన్నాళ్ల విరామం తర్వాత వాళ్లకి అక్క, వదిన పాత్రలతో స్వాగతం పలికేది. కానీ ఇప్పుడు లెక్క మారింది. స్వర్ణయుగం రోజుల్ని గుర్తు చేస్తూ 20 ఏళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తున్న కథానాయికలూ కనిపిస్తున్నారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ పరిశ్రమల్లోని తారలే స్ఫూర్తిగా మన కథానాయికలు కెరీర్‌ని మలుచుకుంటున్నారు. అనుభవం పెరుగుతున్నకొద్దీ అందుకు తగ్గ కథల్ని.. పాత్రల్ని ఎంచుకుంటూ తమ ప్రత్యేకతని ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచుల దృష్ట్యా పరిశ్రమలోనూ మార్పు మొదలైంది. దాంతో ఎవరికి తగ్గ అవకాశాలు వాళ్లకి దక్కుతున్నాయి. త్రిష, నయనతార, శ్రుతిహాసన్‌, కాజల్‌, తమన్నా, అనుష్క, ప్రియమణి, శ్రియ... తదితర సీనియర్‌ భామలందరూ తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్‌ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

చిత్రసీమలో ఆటుపోట్లు ఎక్కువ. ఒకట్రెండు పరాజయాలు ఎదురవ్వగానే అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు పలువురు యువ హీరోయిన్ల పరిస్థితి అదే. ఒకప్పుడు నాలుగైదు సినిమాలతో హల్‌చల్‌ చేసిన కొద్దిమంది కథానాయికల చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఇలాంటి ఆటుపోట్లని ఎదుర్కొని నిలవడమే ఇక్కడ కీలకం. అలాంటి ఎన్నో సవాళ్లని ఎదుర్కొని నిలిచారు సీనియర్‌ కథానాయికలు. ఇప్పుడు వాళ్లే వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతున్నారు.

* త్రిష కెరీర్‌ మొదలై ఇరవయ్యేళ్లు పైనే అయ్యింది. ఇప్పటికీ కుర్రభామలకి దీటుగా రాణిస్తోంది. అటు తమిళంలో విజయ్‌, రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న ఆమె తెలుగులో చిరంజీవికి జోడీగా నటించేందుకు సిద్ధమైంది. చిరంజీవి కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో త్రిష ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇది మలయాళంలో విజయవంతమైన ‘బ్రో డాడీ’కి రీమేక్‌గా రూపొందుతోంది.


* శ్రుతిహాసన్‌ కెరీర్‌ కూడా పదిహేనేళ్లకి చేరువవుతోంది. పడి లేచిన కెరటంలా ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల్ని అందుకుంటూ వెలుగుతోంది శ్రుతి. ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో నటించిన ఆమె, ప్రస్తుతం నానితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్‌లో మరికొన్ని సీనియర్‌ హీరోల సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లే విరామం తీసుకున్న కాజల్‌ ఆ వెంటనే కీలకమైన అవకాశాల్ని సొంతం చేసుకుంది. ‘భారతీయుడు2’లో నటిస్తున్న ఆమె, తెలుగులో ‘సత్యభామ’గా ఓ కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. మరోవైపు బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కలయికలోని ‘భగవంత్‌ కేసరి’లో నటిస్తోంది. ప్రియమణి, శ్రియ తదితర భామలు కూడా క్రమం తప్పకుండా అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’లో త్వరలోనే సందడి చేయనుంది అనుష్క. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ జోరు పెంచే అవకాశాలున్నాయి.


* మరో కథానాయిక నయనతార కెరీర్‌ మొదలై కూడా ఇరవయ్యేళ్లయింది. ఈమె ఇటీవల షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ‘జవాన్‌’లో నటించింది. తమిళంలో మరికొన్ని సినిమాలకి పచ్చజెండా ఊపింది. ఈమె కోసం బాలకృష్ణ సినిమా బృందం కూడా సంప్రదిస్తోంది. బాలకృష్ణ - బాబీ కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రంలో నయన నటించే అవకాశాలున్నట్టు సమాచారం. ఇదే సినిమా విషయంలోనే మరో సీనియర్‌ భామ తమన్నా పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే చిరంజీవితో కలిసి ‘భోళాశంకర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ చిత్రం ‘జైలర్‌’లోనూ నటిస్తోంది తమన్నా.

* దక్షిణాదిలో సీనియర్‌ కథానాయకులు... యువ హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తుండడం కూడా ఈ కథానాయికలకి కలిసొస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అగ్ర హీరోలు తమ వయసుకు తగ్గట్టుగా ఉండే హీరోయిన్లతో ఆడిపాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, అది కూడా వీళ్లకి వరంలా మారిందని  పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని