Varudu Kavalenu Movie: అనంతశ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా కోసం ఆయన రాసిన ‘దిగు దిగు దిగు నాగ’ పాట అశ్లీలంగా మహిళలను కించపరుస్తూ..

Updated : 09 Aug 2021 13:17 IST

నెల్లూరు: ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా కోసం ఆయన ‘దిగు దిగు దిగు నాగ’ పాట రాశారు. అయితే ఈ పాట అశ్లీలంగా మహిళలను కించపరుస్తూ.. నాగదేవత, సుబ్రహ్మణ్యం స్వామి తదితర దేవతామూర్తులను ప్రస్తావిస్తూ ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. ఆ పాటను తొలగించాలంటూ భాజపా మహిళా మోర్చా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు బిందురెడ్డి చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాటతో హిందూ మనోభావాలను దెబ్బతీసిన చిత్రబృందంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు శనివారం రాత్రి పాటల రచయిత అనంతశ్రీరామ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు మరో అయిదుగురిపై కేసు నమోదు చేయాలని కోరుతూ చిల్లకూరు ఎస్సై సుధాకర్‌రెడ్డికి లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. ఈ విషయంపై చిల్లకూరు ఎస్సై సుధాకర్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా భాజపా నాయకురాలు బిందురెడ్డి ‘వరుడు కావలెను’ చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారని, దీనిపై న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని