
AP Floods: వరద బాధితులకు అల్లు అర్జున్ చేయూత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు నటుడు అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తన వంతు ఆర్థికసాయాన్ని ప్రకటించి ఉదారత చాటుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు గురువారం ఉదయం ఆయన ప్రకటించారు. వరద బాధిత జిల్లాలు త్వరితగతిన సాధారణ పరిస్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అల్లు అర్జున్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం విరాళాల అందించేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒక్కొక్కరూ రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూ.10 లక్షలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధిగా అందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రోడ్లు, వంతెనలు కూలిపోవడంతో ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడింది.