Sridevi Soda Center Review: రివ్యూ: శ్రీదేవి సోడాసెంట‌ర్‌

Sridevi Soda Center Review: సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 27 Aug 2021 14:33 IST

చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్‌; నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, పావుల్‌ న‌వ‌గీత‌న్‌‌, న‌రేశ్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేశ్‌, హర్షవర్ధన్‌, స‌ప్తగిరి, క‌ళ్యాణి రాజు, రొహిణి, స్నేహ గుప్త, త‌దిత‌రులు; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్; సంగీతం: మణిశర్మ; క‌థ: నాగేంద్ర కాషా; ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్; నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి; బ్యానర్: 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్; విడుదల తేదీ: 27-08-2021

ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని రేకెత్తించి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘ప‌లాస 1978’తో ఆక‌ట్టుకున్న ద‌ర్శకుడు క‌రుణ‌కుమార్‌.. భిన్నమైన క‌థ‌ల్ని ఎంచుకునే క‌థానాయ‌కుడిగా పేరున్న సుధీర్‌బాబు క‌లిసి చేసిన సినిమా ఇది. మ‌ణిశ‌ర్మ‌, శ్యాంద‌త్.. ఇలా మంచి బృందంతోపాటు 70 ఎమ్‌.ఎమ్‌.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినీ ప్రియుల్లో  ‘శ్రీదేవి సోడా సెంటర్‌’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మ‌రి అందుకు త‌గ్గట్టే సినిమా ఉందా?

క‌థేంటంటే: గోదావరి జిల్లాల్లో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్‌. చుట్టు ప‌క్కల ఏ వేడుక‌లైనా సూరిబాబు డీజే సెట్టే మోగుతుంది. లైటింగే మెరుస్తుంది. జాత‌ర‌లో సోడాల కొట్టు పెట్టిన ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ య‌జ‌మాని సంజీవరావు(న‌రేశ్‌) కూతురు శ్రీదేవిని(ఆనంది) చూసి మ‌న‌సు పారేసుకుంటాడు సూరిబాబు. ఆమె కూడా అత‌నితో ప్రేమలో పడుతుంది. కానీ, ఇద్దరి ప్రేమ‌కి కులం అడ్డొస్తుంది. ఇదిలా ఉండగా ఊరి పెద్దగా చెప్పుకొనే కాశీ (పావుల్‌ న‌వ‌గీత‌మ్) అనుచరుడితో గొడ‌వ వ‌ల్ల సూరి జైలుపాల‌వుతాడు. కేసు కొట్టివేస్తార‌నుకుంటే, అది, అనుకోని కారణాల వల్ల మ‌ళ్లీ సూరిబాబు మెడ‌కు చుట్టుకుంటుంది. అలా, ఓ హ‌త్య కేసులో జైలుకి వెళ్లొచ్చాక సూరిబాబు జీవితంలో ఏం జ‌రిగింది? సూరిబాబు.. శ్రీదేవిని మ‌ళ్లీ క‌లిశాడా లేదా? ఇద్దరి ప్రేమక‌థ సుఖాంత‌మైందా? సూరిబాబు ఎందుకు హత్య చేయాల్సి వ‌చ్చింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ప్రేమ‌క‌థ‌ల్లో ఇటీవ‌ల ప‌రువు కోణాన్ని స్పృశిస్తున్నవి ఎక్కువే. మ‌రాఠీలో వ‌చ్చిన ‘సైరాట్’ మొద‌లుకొని.. మొన్న తెలుగులో వ‌చ్చిన ‘ఉప్పెన‌’ వ‌ర‌కూ ప‌రువు అంశాన్ని ర‌క‌ర‌కాల కోణాల్లో ఆవిష్కరించాయి. స‌మాజంలో అంత‌రాల్ని, వివ‌క్షని తెర‌పై చూపించడం ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. భార‌తీయ సినిమాల్లో ఈ ప్రయ‌త్నం త‌ర‌చూ జ‌రిగేదే. అందులో కావ‌ల్సినంత డ్రామాకి ఆస్కారం ఉంటుంది. ఈసారి గోదావ‌రి జిల్లాల నేప‌థ్యాన్ని వాడుకుంటూ పరువు - ప్రేమ క‌థ‌ని చెప్పే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు క‌రుణ‌కుమార్‌. ఆయ‌న తొలి చిత్రం ‘పలాస‌’తో ఊరి చివ‌రి జీవితాల్ని అత్యంత స‌హ‌జంగా తెర‌పైకి తీసుకొచ్చి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈసారి కూడా వాస్తవిక‌త‌కే పెద్ద పీట వేసినా.. ‘ప‌లాస’ స్థాయి ప్రభావం మాత్రం చూపించ‌లేక‌పోయారు.

ముఖ్యంగా ఈ ప్రేమ‌క‌థలో కొత్తద‌నం కొర‌వ‌డింది. ఆరంభం నుంచి ప్రతీ స‌న్నివేశం ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతుంది. ఇదివ‌ర‌కు చూసిన కొన్ని సినిమాలు, వాటిల్లోని స‌న్నివేశాలు స్పుర‌ణ‌కి వస్తుంటాయి. విరామం స‌మ‌యంలో వచ్చే మ‌లుపుతో క‌థ ర‌క్తిక‌డుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. కాక‌పోతే ఈ త‌ర‌హా ముగింపు కూడా సినీ అభిమానుల‌కి కొత్తేమీ కాదు. త‌న క‌థ రీత్యా ద‌ర్శకుడు ముగింపుని అల్లిన విధానం మాత్రం మెప్పిస్తుంది. త‌రం మారిందంటూ శ్రీదేవి త‌న తండ్రి పాత్రతో చెప్పే సంభాష‌ణ‌లు, ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు క‌త్తి ప‌ట్టుకొచ్చి చెప్పే మాట‌లు అల‌రిస్తాయి. లైటింగ్ సూరిబాబుగా, సోడాల శ్రీదేవిగా నాయ‌కానాయిక‌ల పాత్రల్ని ఓ స‌రికొత్త నేపథ్యంలో మ‌లిచిన తీరు కొత్తగా ఉంటుంది. సంభాష‌ణ‌లు సినిమాకి కీల‌కం. ‘పెద్దమ‌నిషి అంటే ముద్ద పెట్టేవాడు. ముద్ద లాక్కునేవాడు కాదు’, ‘నా దుర‌దృష్టం స‌ముద్రంలో ఉప్పంత’ త‌దిత‌ర సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే: సుధీర్‌బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ప‌ల్లెటూరి వేషం,  గోదావ‌రి యాస‌ని పలికిన విధానం కూడా మెప్పిస్తుంది. శ్రీదేవిగా ఆనంది అందంగా క‌నిపించ‌డంతోపాటు.. ద్వితీయార్ధంలో త‌న న‌ట‌నతో మెప్పిస్తుంది. న‌రేశ్‌ క‌థానాయిక తండ్రిగా ప్రత్యేక‌మైన హావ‌భావాలు ప‌లికిస్తూ న‌టించిన విధానం హైలైట్‌. ప్రతినాయ‌కుడు కాశీ పాత్రధారి, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌ప్తగిరి త‌దిత‌రులు ఆయా పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్యాంద‌త్ కెమెరా ప‌నిత‌నం అడుగ‌గ‌డునా క‌నిపిస్తుంది. ముఖ్యంగా ప‌డ‌వ పోటీల్లో విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ద‌ర్శకుడు క‌రుణ‌కుమార్ అంద‌రికీ  తెలిసిన క‌థ‌నే చెప్పాడు. కానీ ఆయ‌న ఎంచుకున్న నేప‌థ్యం, మాట‌లతో.. కొన్ని స‌న్నివేశాల్లో డ్రామాపై త‌న‌దైన ముద్రవేశారు. నిర్మాణంలో నాణ్యత విలువ‌లు అడుగ‌డుగునా క‌నిపిస్తాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం, సంభాషణలు

+ న‌టీన‌టులు

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- కొత్తద‌నం లేని క‌థ‌

- ప్రథ‌మార్ధం

చివ‌రిగా: శ్రీదేవి సోడా సెంట‌ర్... ఈ ‘సోడా’ సౌండ్ కాస్త త‌క్కువే.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని