Rana: ఆయుధమై కదిలిన ఆకాశం

ప్రజలు బిగించిన పిడికిలి అతడు. ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తుల్ని ధరించిన అడవి అతడు. ఆయుధమై కదిలిన ఆకాశం అతడు.... అతనే అరణ్య అలియాస్‌ రవన్న. మరి ఆయన కథేంటి? ఆయుధం చేతబట్టి ఆయన సాగించిన పోరాటం ఎలాంటి ఫలితాల్ని అందించింది?

Updated : 06 Dec 2022 14:02 IST

ప్రజలు బిగించిన పిడికిలి అతడు. ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తుల్ని ధరించిన అడవి అతడు. ఆయుధమై కదిలిన ఆకాశం అతడు.... అతనే అరణ్య అలియాస్‌ రవన్న. మరి ఆయన కథేంటి? ఆయుధం చేతబట్టి ఆయన సాగించిన పోరాటం ఎలాంటి ఫలితాల్ని అందించింది? తెలియాలంటే ‘విరాటపర్వం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. రానా కథానాయకుడిగా నటించిన  చిత్రమిది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సాయిపల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్‌, నవీన్‌ చంద్ర, ఈశ్వరీ రావ్‌, జరీనా వాహబ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో రానా కామ్రేడ్‌ రవన్న అనే పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘వాయిస్‌ ఆఫ్‌ రవన్న’ పేరుతో ఈ చిత్రం నుంచి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో రానా.. సాయిపల్లవిల ప్రయాణాన్ని.. యుద్ధంలో వారి ప్రేమకథను ఆసక్తికరంగా చూపించారు. ‘‘మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే. రౌద్రపు శత్రువు దాడిని ఎదిరించే పోరాటం మనదే. చలో చలో చలో పరిగెత్తు. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు. చలో చలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో చలో పరిగెత్తు.. దొరల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు..’’ అంటూ టీజర్‌లో రవన్నగా రానా శక్తిమంతమైన సంభాషణలు వినిపించారు. 1990లో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: డానీ సాంచేజ్‌ లోపేజ్‌, దివాకర్‌ మణి.


డేనియల్‌ గర్జన..

వన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. రానా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘‘వాడు అరిస్తే భయపడతావా. ఆడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు..’’ అంటూ డేనియల్‌ శేఖర్‌గా రానా చెప్పిన డైలాగ్‌  ఆసక్తికరంగా ఉంది. ఈ  సినిమాలో పవన్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని