రాజీనామా చేయమని ఆ మంత్రులను అడిగిందెవరు?

ఇటీవల 12 మంది మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించి, చాలామంది కొత్తవారిని క్యాబినెట్‌లోకి తీసుకున్న సంగతి విదితమే

Published : 10 Jul 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల 12 మంది మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించి, కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పేరున్న సీనియర్‌ మంత్రులను కూడా తొలగించడం భాజపా శ్రేణులను, ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అలా కొందరిని తప్పించడం వెనుక వారికి ప్రభుత్వ పదవి కంటే పార్టీ బాధ్యతను అప్పగించేందుకు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆయా మంత్రులను రాజీనామా సమర్పించమని అడిగిందెవరు? ప్రధాని నరేంద్రమోదీనే నేరుగా తన సహచర మంత్రులను అలా అడిగారా? లేదా మరెవరైనా ఈ సంగతి వారికి చేరవేశారా?

ఉద్వాసనకు గురైన ఆ మంత్రులకు విషయాన్ని చేరవేసింది ప్రధానమంత్రి కార్యాలయం కాదట. భాజపా జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా నేరుగా ఫోన్‌ చేసి తెలియజేశారట. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి కూడా పీఎంవో ఆఫీస్‌ నుంచి కాల్‌ వెళ్లలేదట. వారికి ఆ సంతోషకరమైన విషయం తెలియజేసింది భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్. ప్రధాని మోదీ హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటన నుంచి వచ్చిన తర్వాత, జులై6న తొలగించాలనుకున్న మంత్రుల జాబితాను నడ్డాకు సమర్పించారని తెలిసింది. ఆ తర్వాత నడ్డా హోంమంత్రి అమిత్‌ షాను, బి.ఎల్‌.సంతోష్‌ను కలిశారు. ఆ తర్వాతే ఆ 12 మంది మంత్రులను రాజీనామా చేయమని అడిగారు.

మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనవారిలో హేమాహేమీలైన రవిశంకర్‌ ప్రసాద్‌(న్యాయశాఖ), ప్రకాశ్‌ జావడేకర్‌(పర్యావరణ, సమాచార- ప్రసార శాఖ), డా.హర్ష వర్ధన్‌(ఆరోగ్య శాఖ), రమేశ్‌ పోఖ్రియాల్‌(విద్యాశాఖ), సదానందగౌడ(రసాయన, ఎరువుల శాఖ) తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని