Maharashtra Crisis: శివసైనికుల ఆందోళనలు.. 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్‌’ భద్రత

రాష్ట్రంలో శివసేన కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్‌ ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి...

Updated : 26 Jun 2022 14:33 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra Crisis) కొనసాగుతూనే ఉంది. అస్సాంలోని గువాహటిలో మకాం వేసిన శివసేన(Shivsena) రెబెల్‌ ఎమ్మెల్యేలు.. మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌లోనే మరోసారి భేటీ అయిన వారు.. తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. . .

రాష్ట్రంలో శివసేన కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్‌ ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో.. మహారాష్ట్రలో నివసిస్తున్న వారి కుటుంబాలకూ రక్షణ లభించనున్నట్లు తెలిపాయి. వై+కేటగిరి భద్రతలో మొత్తం 39 మంది సిబ్బంది ఉంటారు. ఎప్పుడూ 2-4 కమాండోలు, 11 మంది పోలీసులు ఉంటారు.  మూడు షిఫ్టుల్లో ఈ సంఖ్యలో సిబ్బంది ఉంటారు. 2-3 వాహనాలు ఉంటాయి

తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) బృందంలోని ఎమ్మెల్యేల్లో దాదాపు 20 మంది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray)తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారిలో కొందరు భాజపాలో విలీనానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసమ్మతి ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ.. శివసేన కార్యకర్తలు ఆదివారం సైతం రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు.. శిందే మద్దతుదారులు ఠాణెలో నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే.. కల్యాణ్‌లోని శిందే కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆయన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ శిందే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు.. శిందేతోపాటు ఇతర తిరుగుబాటు మంత్రులపై చర్యలు తీసుకోవాలని శివసేన యోచిస్తోన్నట్లు సమాచారం. ఫలితంగా.. మంత్రులు శిందే, గులాబ్‌రావు పాటిల్, దాదా భూసే తమ శాఖలను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయ మంత్రులైన అబ్దుల్ సత్తార్, శంబురాజే దేశాయ్‌లపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న ఏక్‌నాథ్ శిందేను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ అభిప్రాయం తీసుకున్న తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం.. కోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంబంధిత నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కనీసం ఏడు రోజుల సమయం ఇవ్వాల్సిందని శిందే వర్గం వాదిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని