అలాగైతే నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ

బిహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై హత్యారోపణలు చేస్తు్న్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ మండిపడ్డారు. దళిత నేత శక్తి మాలిక్‌ హత్య కేసులో తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తు్న్నారని అన్నారు. నేరం చేశానని భావిస్తే...

Published : 09 Oct 2020 14:22 IST

పట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై హత్యారోపణలు చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ మండిపడ్డారు. దళిత నేత శక్తి మాలిక్‌ హత్య కేసులో తనను కావాలనే ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నేరం చేశానని భావిస్తే అరెస్టు చేయాలి, లేదంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అంతేగానీ, ఎన్నికల వేళ నిరాధార ఆరోపణలు చేస్తూ.. దొంగదెబ్బ తీయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఘాటుగా లేఖ రాశారు.

తాజా ఎన్నికల్లో తేజస్వి యాదవ్‌ ప్రతిక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన దళిత నేత శక్తిమాలిక్‌ హత్యకేసుతో తేజస్వి యాదవ్‌కు, ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు సంబంధాలున్నాయని వార్తలొచ్చాయి. మాలిక్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఇప్పటికే ఏడుగుర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గత ఆదివారం ద్విచక్రవాహంపై వచ్చి ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న మాలిక్‌ను హత్య చేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త స్వతంత్రంగా పోటీ చేస్తారనే భయంతోనే ఆర్జేడీ నేతలు హత్య చేయించారని మాలిక్‌ భార్య ఆరోపిస్తున్నారు. అయితే హత్య వెనక దీనికి సంబంధించి తేజస్వీ, తేజ్‌ ప్రతాప్‌ హస్తం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పూర్ణియా జిల్లా ఎస్పీ విశాల్‌ శర్మ వెల్లడించారు. శక్తి మాలిక్‌ స్థానికంగా కొందరికి అప్పులిచ్చేవాడని, తిరిగి వాళ్లు చెల్లించలేకపోతే దౌర్జన్యానికి పాల్పడేవాడని, ఈ క్రమంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు శక్తి మాలిక్‌ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశారు. తమ పార్టీ తరఫున పోటీ చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్‌ డిమాండ్‌ చేశారని ఆ వీడియోలో ఆరోపించారు. ఆర్జేడీ నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఇలా జరిగిన కొన్నాళ్లకే మాలిక్‌ హత్యకు గురికావడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దీంతో అధికార జేడీయూ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. అయితే, ఈ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అవసరమైతే చట్టం తన పనిని తాను చేసుకోవచ్చని ఆర్జేడీ వాదిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని