బిహార్‌ ఓటరు ఎటువైపో..?

బిహార్‌లో ఓట్ల పండుగ మొదలైంది. తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరు జిల్లాల్లోని 72 స్థానాలకు..

Updated : 28 Oct 2020 12:37 IST

ఎవరి అంచనాల్లో వారే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో ఓట్ల పండుగ మొదలైంది. తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరు జిల్లాల్లోని 71 స్థానాలకు ఇవాళ తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నగరా మోగినప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించిన ఆయా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో వేడి పుట్టించాయి. అధికార, విపక్ష కూటముల పొత్తులు, కొత్త ఎత్తులు, ప్రచారంలో హేమాహేమీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ మార్మోగుతోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు, దళిత ప్రజల ఆశాకిరణం రాంవిలాస్‌ పాశ్వాన్‌ హఠాన్మరణం, ఆర్జేడీ అగ్రనేత లాలూప్రసాద్‌ యాదవ్‌ జైలులో ఉండటం, మరో దళిత నేత అయిన జితిన్‌ రాం మాంఝీ తిరిగి ఎన్డీయే శిబిరానికి చేరడం ఈ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం ఉండనుంది. కరోనా మహమ్మారి విజృంభణ, భీకర వరదలు, నిరుద్యోగం తదితర కీలక సమస్యల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తన పాలనలో అభివృద్ధే తమను గెలుపు వైపుగా నడిపిస్తుందని నితీశ్‌ ధీమా వ్యక్తంచేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు విజయాన్ని చేకూర్చుతుందని ఆర్జేడీ కూటమి ఆశిస్తోంది. 

అదే రిపీటవుద్ది: ఎన్డీయే
బిహార్‌లో మరోసారి తమదే విజయమని ఎన్డీయే కూటమి విశ్వాసంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలనే రిపీట్‌ చేస్తామంటూ భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకు గాను భాజపా - జేడీయూ - ఎల్జేపీ కూటమి 39 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ఈసారి ఎల్జేపీ ఎన్డీయే కూటమికి దూరమై ఒంటరిగా బరిలో ఉంది. భాజపా, మరో రెండు చిన్న పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా ఈ ఎన్నికల బరిలో దిగిన నితీశ్‌.. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే శ్రీరామ రక్షగా భావిస్తున్నారు. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న ఆయన.. గతంలో ఆర్జేడీ హయాంలో లాలూ, రబ్రీదేవి 15 ఏళ్ల పాలననే టార్గెట్‌ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2015 ఎన్నికల్లో ఇచ్చిన ‘సాత్‌ నిశ్చయ్‌ యోజన’తో పాటు పలు వాగ్ధానాలను నెరవేర్చామని చెబుతూ ఎన్డీయే కూటమి ప్రజల్లోకి వెళ్లింది. ఇంటింటికీ తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ కనెక్షన్లు, యువతకు ఆర్థిక సాధికారత కల్పించడం, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35శాతం రిజర్వేషన్లు కల్పన, అన్ని జిల్లాల్లో మెరుగైన వైద్య వసతుల కల్పన, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, నర్సింగ్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే ఆత్మనిర్భర్‌ బిహార్‌కు కట్టుబడి 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. బిహార్‌లో 2018లో 7.2శాతంగా ఉన్న నిరుద్యోగం.. 2019కి 10.2శాతానికి పెరిగింది. అలాగే, కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 2మిలియన్ల మంది వలస కూలీలు బిహార్‌కు తిరుగుముఖం పట్టడంతో అక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో నిరుద్యోగం భారీ స్థాయికి చేరింది. నితీశ్‌ సారథ్యంలోని కూటమికి ఇది పెద్ద సవాలే. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలను ఎన్డీయే ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతోంది. 

నిరుద్యోగ సమస్యే తేజస్వి అస్త్రం  
దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకు వెళ్లడంతో ఆయన తనయుడు తేజస్వి యాదవే ఎన్నికల బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి కూటమి కట్టి ప్రత్యర్థి జట్టుకు సీఎం అభ్యర్థిగా బరిలో దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు నిరుద్యోగ సమస్యను ఆయుధంగా చేసుకొని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుస్తూ యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గతంలో జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో కొంతకాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి.. తనకున్న కొద్దిపాటి అనుభవంతోనే ఈ ఎన్నికల సమరంలోకి దూకారు.  సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశాలు, ప్రెస్‌మీట్‌లు, బహిరంగ సభల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే తొలి కేబినెట్‌ సమావేశంలోనే యువతకు 10లక్షల ఉద్యోగాలకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, వృద్ధులకు పింఛను 400 నుంచి 1000కి పెంపు, కాంట్రాక్టు అధ్యాపకులకు రెగ్యులర్‌ పే, అంగన్‌వాడీ వర్కర్లకు గౌరవవేతనం పెంపు, రైతు రుణాల మాఫీ తదితర హామీలు కురిపిస్తున్నారు. ఈసారి బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సారథ్యం లేకుండా ఎన్నికల ప్రచారం ప్రతిపక్షానికి పెద్ద సవాలే. ఈ ఎన్నికల్లో పొత్తుల విషయంలో, అనేక కులాల సమాహారంగా ఉన్న బిహార్‌ ప్రజలను ఏ మేరకు ఆకర్షించగలుగుతారనేది ఆసక్తికరమే.  

ఎల్జేపీకి ఒంటరి పోరు కలిసొచ్చేనా?
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీచేసిన ఎల్జేపీ నితీశ్‌తో తీవ్రంగా విభేదించి.. ఒంటరిపోరు సాగిస్తోంది. భాజపా జేడీయూతోనే కలిసి వెళ్లేందుకు నిశ్చయించుకున్నప్పటికీ.. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నితీశ్‌పై చేసిన ఆరోపణల్ని భాజపా ఖండించకపోవడంతో భాజపాకు ఆ పార్టీ బీటీమ్‌ అనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యలు చేయడం, జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని బరిలోకి దించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆయన తండ్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ ఈ నెల 8న కన్నుమూయడంతో ప్రచార బాధ్యతలను చిరాగ్‌ నిర్వహించారు. మొత్తం 143 స్థానాల్లో ఎల్జేపీ పోటీ చేస్తోంది. 

దళిత ఓటరు ఎటువైపు?

బిహార్‌లో జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపోటముల్ని దళితులే ప్రభావితం చేయనున్నారు.  మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 16శాతం ఓటు బ్యాంకు ఉన్న దళితులు ఎంతో కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రధాన పార్టీల నేతలందరూ నిమగ్నమయ్యారు. కొంతకాలంగా దళిత ఓట్లర్లలో ఆకర్షణీయమైన నేతగా ఉన్న రాంవిలాస్‌ పాసవాన్‌ను ఢీకొట్టేందుకు జితిన్‌ రామ్‌ మాంఝీలాంటి నేతలను భాజపా- జేడీయూ కూటమి మరోసారి తెరపైకి తెస్తోంది. వారి ద్వారా దళిత ఓట్లపై పట్టుసాధించాలనే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  మొత్తం 243 సీట్లు ఉండగా.. 40 సీట్లు ఎస్సీ రిజర్వుడు. 16శాతం దళిత ఓటర్లు ఉండటంతో రిజర్వుడు స్థానంలో కాకుండా మిగతా చోట్ల కూడా వీరి పాత్ర ఎంతో కీలకం. ఎన్నికల సమయంలో అందుకే బిహార్‌లో దళిత సమస్యలు ప్రధానంగా చర్చకువస్తాయి. అయితే, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం దళితుల కోసం ఏమీ చేయడం లేదని ఆర్జేడీ ఆరోపిస్తోంది. దళితులనుంచి మరింత వెనుకబడిన వర్గాలను మహాదళితులుగా వర్గీకరించారు. ఈ కార్యక్రమం నితీశ్‌ గతంలో చేపట్టారు. దీంతో మహాదళితుల ఓట్లు తమకు లాభిస్తాయని జేడీయూ కూటమి ఆశిస్తోంది.

అంతంతమాత్రంగానే ఎన్సీపీ, ఎస్పీ ప్రభావం

బిహార్‌లో ప్రధాన పార్టీలే కాకుండా ఎంఐఎం, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీలు సహా పలు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న ఈ పార్టీలు ఇక్కడ ఓట్లు చీల్చడానికే పరిమితమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమయ్యాయి. బిహారీ గడ్డపై గెలుపు మార్గం వెదికే పనిలోపడ్డాయి. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌, జేఎంఎం వంటి పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చి ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి. ఎన్సీపీ పరిస్థితి అంతంతమాత్రమే. ఎన్సీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అన్వర్‌ 2018లో పార్టీని వీడినప్పటి నుంచి గడ్డు కాలం నడుస్తోంది.  ఎస్పీ, బీఎస్పీ పరిస్థితి ఇలాగే ఉంది. బిహార్‌లో ఎస్పీ ప్రభావం తగ్గుతూ వస్తోంది. 2005లో 142 స్థానాలకు పోటీచేసి 4 స్థానాలకే పరిమితమైన ఎస్పీ.. వరుసగా 2010, 15 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం కూడా ఇక్కడ సపోర్టింగ్‌ రోల్‌కే పరిమితమైపోయింది. 2010 ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకున్న ఆ పార్టీ 2015 ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 2015లో ఎస్పీ, ఎంఐఎం, జేఎంఎం పార్టీలు ఒక కూటమిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటాలని సంకల్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని