బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతికి వినతి

పార్లమెంట్‌ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆ బిల్లులను సభలో ఆమోదించుకున్నారని..........

Published : 24 Sep 2020 00:59 IST

దిల్లీ: పార్లమెంట్‌ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆ బిల్లులను సభలో ఆమోదించుకున్నారని, వాటిని వెనక్కి పంపాలని విన్నవించాయి. ఈ మేరకు విపక్షాల తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ బుధవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. విపక్షాల తరఫున వినతపత్రం సమర్పించారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులు తీసుకొచ్చేముందు ఇతర పార్టీలను గానీ, రైతు సంఘాల నేతలను గానీ కేంద్రం సంప్రదించలేదని చెప్పారు. బిల్లులను ఆమోదించే క్రమంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. దీనిపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆమోద పొందిన బిల్లులను వెనక్కి పంపాలని కోరినట్లు తెలిపారు.

ఇటీవల మూడు కీలక బిల్లులను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్‌ 2020, ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్‌ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020ని ఇరు సభలూ ఆమోదించాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందులో రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ఆదివారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో అందుకు కారణమైన 8 మంది ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని