ఇప్పుడు స్పందించరేం..

పంజాబ్‌ హత్యాచార ఘటన పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు స్పందించకపోవటంపై ప్రకాశ్‌ జావడేకర్‌ నిరసన వ్యక్తం చేశారు.

Published : 24 Oct 2020 19:35 IST

పంజాబ్‌ హత్యాచార ఘటనపై సోనియా కుటుంబానికి సూటి ప్రశ్న

దిల్లీ: పంజాబ్‌లో చోటుచేసుకున్న దళిత బాలిక హత్యాచార ఘటన పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు స్పందించకపోవటంపై.. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నిరసన వ్యక్తం చేశారు. హోషియార్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి, అనంతరం దహనం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, చిన్నారి మృతదేహం టాండా పట్టణం సమీపంలోని జలాల్‌పూర్‌ గ్రామంలో లభించింది. ఈ కేసులో గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే యువకుడు, ఆయన తాత సుర్జీత్‌ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరణించిన బాలిక తండ్రి బిహార్‌ నుంచి వచ్చిన వలస కార్మికుడని తెలిసింది.

కాగా, ఇది అత్యంత దిగ్భాంతికర సంఘటన అని.. దీనిపై సత్వరమే కఠిన చర్య తీసుకోవాలని ఆయన రాహుల్‌ గాంధీని డిమాండ్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ హాథ్రస్‌ ఘటన పట్ల కఠిన విమర్శలు చేసిన గాంధీల కుటుంబం.. రాజకీయ యాత్రలను ఆపి పంజాబ్‌లో మహిళల పట్ల జరుగుతున్న నేరాల పట్ల దృష్టి పెట్టాలని మంత్రి హితవు పలికారు.

‘‘సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరూ టాండా బాధితురాలి కుటుంబాన్ని సందర్శించనే లేదు. వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలను గురించి వారు పట్టించుకోరు. కానీ హాథ్రస్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో ఫోటోలు తీసుకుంటారు.’’ అని ఈ సందర్భంగా జావడేకర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని