Abhishek Banerjee: ఎన్‌ఐఏ అధికారికి భాజపా పార్సిల్‌.. ఆధారాలతో సుప్రీంను ఆశ్రయిస్తాం: అభిషేక్‌ బెనర్జీ

ఎన్‌ఐఏ అధికారితో కలిసి తమ నేతలపై భాజపా కుట్ర పన్నుతోందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Published : 10 Apr 2024 14:39 IST

కోల్‌కతా: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ నేతలను లక్ష్యంగా చేసుకుందని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ఆరోపించారు. అందులోభాగంగా తమపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను ప్రయోగిస్తోందన్నారు. దానికి చెందిన ఓ అధికారితో భాజపా నాయకుడికి డీలింగ్‌ కుదిరిందన్నారు. ఓ పార్శిల్‌ చేతులు మారిందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై తమ పార్టీ సాక్ష్యాధారాలతో త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని తెలిపారు. టీఎంసీ నేతలపై కాషాయ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. ‘‘కోల్‌కతాలోని ఎన్‌ఐఏ అధికారి ఎస్పీ ధన్‌రామ్‌సింగ్‌ను ఇటీవల భాజపా నేత జితేంద్ర తివారీ కలిశారు. 52 నిమిషాల పాటు వారి భేటీ జరిగింది. ఆ ఇంటి లోపలికి వెళ్లే ముందు భాజపా నేత చేతిలో ఉన్న తెల్లటి పార్సిల్‌ ఉంది. సమావేశం తర్వాత నేత ఖాళీ చేతులతో బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అధికారిని కలిసిన మర్నాడే ఎన్‌ఐఏ మా పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై త్వరలో మా పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఎన్‌ఐఏ అధికారి నివాసానికి సంబంధించిన ఇన్‌-అవుట్‌ ఎంట్రీ రిజిస్టర్‌ వివరాలను టీఎంసీ బహిర్గతం చేసింది. మరోవైపు ప్రతిపక్షాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్‌ఐఏ సంస్థల డైరెక్టర్లను మార్చాలంటూ ఈసీని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈసీ అధికారులను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని