Akhilesh Yadav: ఇలా ప్రవర్తిస్తే కాంగ్రెస్‌తో ఎవరు ఉంటారు?: అఖిలేశ్‌ ధ్వజం

మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరుపై అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి విమర్శలు చేశారు.

Updated : 20 Oct 2023 21:23 IST

షాజహాన్‌పూర్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ యూపీలోని షాజహాన్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్‌ పార్టీ తీరును ఆయన గురువారం తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి కొనసాగింపుగా శుక్రవారం షాజహాన్‌పుర్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇదే రకమైన అయోమయాన్ని కొనసాగిస్తే మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాజపాను ఓడించలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లో తమకు సీట్లు ఇవ్వడం ఇష్టంలేకపోతే ముందే ఆ విషయం చెప్పి ఉండాల్సిందన్నారు. తమకు సొంత బలం ఉన్న సీట్లలో పోటీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో లోక్‌సభ ఎన్నికలు వస్తాయని.. అప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇదేరకమైన ప్రవర్తనతో ఉంటే ఇక ఆ పార్టీతో ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు. ఇలాంటి అయోమయ స్థితితో భాజపాపై ఎన్నికల్లో పోరాడితే విజయం సాధించలేమన్నారు.

యూపీలో కాంగ్రెస్‌కు ఇదే మర్యాద చేస్తాం

‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడం పీడీఏ ఫార్ములా(వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు)తోనే సాధ్యమవుతుందన్నారు. పీడీఏ ఫార్ములా తర్వాతే ఇండియా కూటమి ఏర్పాటైందని చెప్పారు. ‘ఇండియా’ కూటమి ఉన్నప్పటికీ తాము చెబుతోన్న పీడీఏ వ్యూహం ఎన్డీయేను ఓడించగలదని తాను చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. శుక్రవారం షాజహాన్‌పుర్‌లో భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అఖిలేశ్‌ పాల్గొన్నారు. భవిష్యత్తులో భాజపా నుంచి ఎదురయ్యే సవాళ్లు, కుట్రల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. భాజపా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో, అసత్యాలు, విద్వేషాలను ఎలా ప్రచారం చేస్తోందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో మౌలిక వసతులు అస్తవ్యస్తంగా మారాయని.. షాజహాన్‌పూర్‌లో ఎక్కడ చూసినా చెత్త, వీధుల్లో జంతువులు తిరుగుతున్న పరిస్థితులు కనబడ్డాయన్నారు. ట్రాఫిక్‌ ఏర్పాట్లు సైతం సరిగా లేవని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని