Sharad Pawar: ‘ఆ ప్రయత్నం ఆందోళనకరం’.. కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌పై పవార్‌ వ్యాఖ్య

భారీ కాన్వాయ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ (KCR) మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడంపై శరద్‌ పవార్‌ (Sharad Pawar) స్పందించారు. ఆ ప్రయత్నం ఆందోళనకరమన్నారు.

Published : 28 Jun 2023 15:27 IST

పుణె: తెలంగాణ ముఖ్యమంత్రి, భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (CM KCR) ఇటీవల మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం వెంట 600లకు పైగా వాహనాలతో హైదరాబాద్‌ నుంచి సోలాపుర్‌ వరకు భారీ కాన్వాయ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే దీనిపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తన బలాన్ని ప్రదర్శించేందుకు చేసిన ప్రయత్నం ఆందోళనకరమని ఆక్షేపించారు.

‘‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి వచ్చి ఆలయాలను సందర్శించడానికి వస్తే అందుకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, భారీ సంఖ్యలో వాహనాలను తీసుకొచ్చి తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్‌ తన పర్యటనలో ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తే బాగుండేది’’ అని పవార్ (Sharad Pawar) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో పండరిపుర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఎన్సీపీ నేత భగీరత్‌ భాల్కే మంగళవారం కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. దీనిపై పవార్‌ స్పందిస్తూ.. ఒక్క వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు.

గత సోమవారం మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్‌ (KCR).. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పండరిపుర్‌లోని శ్రీ విఠల్‌ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించారు. తర్వాత పలు ఆలయాలను దర్శించుకుని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్కోలీలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, కేసీఆర్‌ పర్యటనపై మహారాష్ట్ర రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. భారాస అంటే భాజపా బీ టీం అని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని