Bandi Sanjay: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

తెలంగాణ భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ను.. పార్టీ అధిష్ఠానం జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది.

Updated : 29 Jul 2023 15:53 IST

దిల్లీ: భాజపా జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటుదక్కింది. తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, కార్యదర్శిగా సత్యకుమార్‌ (ఏపీ)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏకే ఆంటోనీ కుమారుడికి చోటు..

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గంలో భాజపా కీలక మార్పులు చేసుకుంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ నుంచి పస్మాండ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి జాతీయ నాయకత్వంలో చోటు కల్పించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇక కాంగ్రెస్‌ దిగ్గజ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ (ఈ ఏడాదే భాజపాలో చేరారు)కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన పార్టీ కార్యదర్శిగా ప్రకటించారు. 

ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సీటీ రవి (కర్ణాటక), దిలీప్‌ సైకియా (అస్సాం)ను ఆ పదవుల నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిలీప్‌ ఘోష్‌ను ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆదివాసీ నేత లతా ఉసెందిని ఉపాధ్యక్ష పదవికి ప్రమోట్‌ చేశారు. తాజా మార్పులతో భాజపా జాతీయ కార్యవర్గంలో మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని