Telangana News: మరోసారి వడ్ల పంచాయితీ... సంజయ్‌ ఆరోపణలను తిప్పికొట్టిన నిరంజన్‌రెడ్డి

యాసంగి ధాన్యం కొనుగోళ్ల  చెల్లింపు అంశంపై తెరాస, భాజపా మధ్య రాజకీయ రగడ మొదలైంది. రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ

Published : 23 Jun 2022 01:14 IST

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్ల  చెల్లింపు అంశంపై తెరాస, భాజపా మధ్య రాజకీయ రగడ మొదలైంది. రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఈ లేఖపై మంత్రి నిరంజన్‌రెడ్డి  ఘాటుగా స్పందించారు. ‘బండి సంజయ్‌ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది’’ అని మండిపడ్డారు.   

బండి సంజయ్‌ ఏమన్నారంటే..?

తెలంగాణలో ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకి వచ్చి సమీక్షించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యాసంగిలో ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా చెల్లింపులు చేయలేదన్నారు. యాసంగి వడ్ల డబ్బులను వెంటనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లకు రూ.517.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని తెలిపారు. రైతుబంధు సొమ్మునూ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. పంటల సాగుకు పెట్టుబడులు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో వివరించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రైతుబంధు, యాసంగి ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయంలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. 

రాజకీయాల్లో హస్య నటుడిలా తయారయ్యారు

బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తీరు.. హంతకుడే సంతాపం తెలిపినట్లుందని మండిపడ్డారు. గత యాసంగిలో వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని రైతులను రెచ్చగొట్టి.. ఇప్పుడు ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నాక తీరిగ్గా డబ్బులివ్వాలని లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత, రైతు సమస్యల గురించి నోరెత్తే అర్హత బండి సంజయ్‌కు ఉందా?అని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్‌నోట్లు విడుదల చేయడంతోపాటు మరుసటి రోజు పత్రికలు చదివితే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో? వ్యవసాయ శాఖ ఎక్కడుందో? తెలుస్తుంది. ప్రెస్‌నోట్లు, ప్రెస్‌మీట్లు మినహా భాజపా రాష్ట్రంలో ఏం చేస్తుంది? ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా? కనీసం ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ది కోసమైనా ఒక్క రూపాయి తెచ్చారా? బండి సంజయ్ డిమాండ్లు చూసి రైతులు నవ్వుకుంటున్నారు? రాజకీయాల్లో హస్య నటుడిలా తయారయ్యారు’’ అని వ్యంగాస్త్రాలు సంధించారు. మరోవైపు ప్రభుత్వం రైతుల నుంచి యాసంగిలో రూ.9772.54 కోట్లతో 49.92 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.7,464.18 కోట్లు  చెల్లించామని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిన డబ్బుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని, అది త్వరలోనే పూర్తవుతుందని ప్రకటించారు. బండి సంజయ్ లాంటి వారి నుంచి సూచనలు తీసుకునే దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని