Future PM: భావి ప్రధాని మా నేత.. అఖిలేశ్‌, రాహుల్‌ల పోస్టర్‌ వార్‌!

తమ నేత భావి ప్రధాని అని పేర్కొంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీల చిత్రాలతో కూడిన పోస్టర్లు వెలువడడం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది.

Updated : 26 Oct 2023 17:18 IST

లఖ్‌నవూ: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కాబోయే ప్రధాన మంత్రి (Future Prime Minister) తమ నేతనే అంటూ కాంగ్రెస్‌ (Congress), సమాజ్‌వాదీ పార్టీ (SP) నేతలు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్‌ ప్రదేశ్‌లో పోస్టర్‌ వార్‌ సాగుతోంది. తమ నేత భావి ప్రధాని అని పేర్కొంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీల చిత్రాలతో కూడిన పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమయ్యింది.

యూపీ కాంగ్రెస్‌ కార్యాలయం ముందు రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ వెలుగు చూసింది. 2024 ప్రధానమంత్రి రాహుల్‌ గాంధీ, 2027లో యూపీ ముఖ్యమంత్రి అజయ్‌ రాయ్‌ అంటూ అందులో పేర్కొన్నారు. అంతకుముందు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) కాబోయే ప్రధానమంత్రి అంటూ ఆ పార్టీ నేతలు రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఈ పోస్టర్‌ వెలిసినట్లు భావిస్తున్నారు.

2024 ఎన్నికల్లో ‘పీడీఏ’దే హవా : అఖిలేశ్‌

ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోటీ ఉంటుందని.. రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు కూడా మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ నేత నిశాంత్‌ సింగ్‌ నితిన్‌ పిలుపు నిచ్చారు. దీనిపై ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రూల్‌ హసన్‌ మాట్లాడుతూ.. వెనకబడిన తరగతులు, దళితులు, మైనార్టీల కోసం పనిచేస్తున్న పార్టీ తమదేనని అన్నారు. అందుకే ఈ పోస్టర్‌ పెట్టామన్న ఆయన.. కాంగ్రెస్‌ ఎన్ని పోస్టర్లు పెట్టినా అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇదే వ్యవహారంపై అటు భాజపా కూడా స్పందించింది. అఖిలేశ్‌ అలా ఆలోచించడం (ప్రధానమంత్రి కావాలని) పగటి కలే అవుతుందని విమర్శించింది. ఇండియా కూటమిలోని ఇతర నేతలపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగమేనని పేర్కొంది.

ఇదిలాఉంటే, రాష్ట్రాల్లో కలిసి పనిచేసే అంశంలో విపక్షాల కూటమి ఇండియా (INDIA) తీరుపై అఖిలేశ్‌ యాదవ్‌ కొంత కాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇండియా కూటమిపై అఖిలేశ్ బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే విపక్ష కూటమికి చెందిన ఇద్దరు కీలక నేతలు ‘భావి ప్రధాని’ అంటూ ఆయా పార్టీలు పోస్టర్లతో ప్రచారం చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని