Gujarat Election 2022: గెలుపు మాదంటే మాది.. అప్పుడే భాజపా, కాంగ్రెస్‌ అంచనాలు!

Gujarat Election 2022: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పూర్తయ్యింది. రెండో విడత ఇంకా మిగిలే ఉంది. ఇంతలోపే పార్టీలు విజయం తమదేనంటూ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

Published : 04 Dec 2022 01:03 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Gujarat Election 2022) తొలి విడత పూర్తయ్యింది. రెండో విడత ఇంకా మిగిలే ఉంది. ఫలితాలకు మరో ఐదు రోజుల సమయం ఉంది. ఇంతలోపే గెలుపు ‘మాదంటే మాదంటూ’ ప్రచారన్నందుకున్నాయి పార్టీలు. తొలి విడత పోలింగ్‌ సరళి చూస్తే తమకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ (Congress).. మరోసారి తమదే విజయమంటూ భాజపా (BJP) ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

182 స్థానాలున్న గుజరాత్‌లో ఈ నెల 1న 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి. తొలి విడత పోలింగ్‌లో 63.31 శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గినా.. ఓట్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలు అప్పుడే గెలుపుపై తమ అంచనాలను వెలువరించాయి.

తొలి విడత పోలింగ్‌ సరళిని గమనిస్తే 89 స్థానాల్లో కాంగ్రెస్‌కు 65 స్థానాలు రాబోతున్నాయయని కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జి రఘు శర్మ అన్నారు. ఓటమి భయంతోనే ప్రధాని మోదీని, అమిత్‌షాను భాజపా గ్రామస్థాయిలో ప్రచారానికి దింపిందని విమర్శించారు. రెండు విడతల్లో కలిపి 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

మరోవైపు తొలి విడత పోలింగ్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ సైతం ధీమాగా ఉన్నారు. 2017లో పోలిస్తే సౌరాష్ట్ర, కచ్‌, దక్షిణ గుజరాత్‌ (తొలి విడత ఎన్నికలు జరిగిన ప్రాంతాలు)లో ఓటింగ్‌ శాతం తగ్గినప్పటికీ.. ఓట్ల సంఖ్య పెరిగిందన్నారు. 2017లో 1.41 కోట్ల ఓట్లు పోలైతే ఈ సారి 1.51 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. భాజపా మరోసారి గత రికార్డులను తిరగరాస్తూ విజయం సాధిస్తుందన్నారు.

2017 ఎన్నికల్లో భాజపా 99 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 77 స్థానాలు వచ్చాయి. వరుసగా ఏడోసారీ అధికారంలోకి రావాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈసారి ఆప్‌ బరిలోకి దిగడంతో ఎవరి ఓట్లు చీల్చుతుందోనన్న భయం రెండు పార్టీల్లో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని